Tuesday, December 3, 2013

నేను నవ్వలేదు

కథ, అభ్యాసము: శైలజ వాడకట్టు 

"అమ్మా అమ్మా!” ఆరేళ్ళ శోభ పరిగెత్తుకుంటూ సోఫాలో కూర్చుని లాప్ టాప్ లో ఆఫీస్ పని చేసుకుంటున్న వాళ్ళమ్మ దగ్గరికి వచ్చింది.

"వచ్చావా తల్లీ, సుష్మా పుట్టిన రోజు పండుగ బాగా జరిగిందా?" పలుకరించింది అమ్మ.
"చాలా బాగా జరిగిందమ్మా! అక్కడో తమాషా జరిగింది.” చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ చెప్పింది శోభ.
"తమాషానా?" అమ్మ తన ఒళ్ళోని లాప్ టాప్ 
తీసి కాఫీ టేబుల్ మీద పెట్టి శోభ వైపు చూసింది. 
“ఊ...తమాషానే, ఒక అమ్మాయి కుర్చీలో కూర్చోబోతూ ఢామ్మని కింద పడ్డది.” వాళ్ళమ్మ కూర్చున్న సోఫా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చు౦ది శోభ.
“అయ్యొయ్యో! ఎలా పడింది పాపం?” సానుభూతిగా అడిగింది అమ్మ.
“ఆ అమ్మాయి కుర్చీలో కూర్చోబోతుండగా, ఓ కొంటె పిల్ల కుర్చీ పక్కకు లాగింది. అంతే! ఆ అమ్మాయి ఢామ్మని కింద పడిపోయింది.”

"ఎవరే ఆ కుర్చీ లాగిన అమ్మాయి? అలా చేయటం తప్పుకదూ!”

“అవునమ్మా, చాలా తప్పు. పైగా పాపం ఆ అమ్మాయి కిందపడితే లేవదియాల్సింది పోయి, అందరూ పకపక నవ్వుతూ చప్పట్లు చరుస్తూ ఎగతాళి చేశారమ్మా!"
"ఎగతాళి చేశారా?"

“అవునమ్మా! పాపం! ఆ అమ్మాయి చాలా బాధ పడ్డది”

"ప్చ్...పాపం! ఆ అమ్మాయికి ఏడుపు రాలేదా?"
“వచ్చింది, కాని ఏడుపు బిగబట్టుకుంది” కుర్చీ దిగి వాళ్ళమ్మ దగ్గరకొచ్చింది.
“ఆ అమ్మాయి ఎవరయితేనేం గాని, మీరు అలా నవ్వకు౦డా ఉండాల్సింది” శోభ ఫ్రాక్

సరిచేస్తూ చెప్పింది.
“నేను మాత్రం నవ్వలేదమ్మా!” తల అడ్డంగా తిప్పుతూ చెప్పింది. శోభ పోనీటేల్ తమాషాగా ఊగింది.

“ఎంత మంచిదానివమ్మా! నిజంగా నీవు బంగారు తల్లివే!” అంటూ అమ్మ శోభను దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టుకుంది.

“అంత మంది నవ్వుతుంటే నీకు నవ్వురాలేదా, శోభా?” కుతూహలంగా అడిగింది.
"ఊహు... నేను నవ్వలేదు. నాకు అసలు నవ్వురాలేదు కూడా" అమ్మ మీద కూర్చుని మెడ చుట్టూ చేతులు వేస్తూ చెప్పింది శోభ.
“ఎందువల్లనే?” అడిగింది అమ్మ.

"ఆ కింద పడ్డ పిల్లను నేనే!" తల వంచుకుని మెల్లగా చెప్పింది శోభ.

అభ్యాసము

1. ఈ కింది ప్రశ్నలకు పూర్తి వాక్యంలో జవాబులు వ్రాయండి.

అ. శోభ వయస్సు ఎంత?



ఆ. శోభ ఎవరి ఇంటికి వెళ్ళింది ?



ఇ. పుట్టిన రోజు ఎవరిది?



ఈ. కుర్చీలో కూర్చోబోతూ కింద పడిన పాప ఎవరు?



ఉ. శోభ ఎందుకు కింద పడింది?



ఊ. శోభకు ఏడుపు రాలేదా?



ఋ. శోభ ఎందుకు నవ్వలేదు?




2. కింది వాక్యాలు తప్పో, ఒప్పో బ్రాకెట్లలో గుర్తించండి.

తప్పుకు (x ) గుర్తును, ఒప్పుకు (-/) గుర్తును వ్రాయండి.

అ. ఆ రోజు సుష్మా పుట్టిన రోజు. (    )
ఆ. కుర్చీలో కూర్చోబోతూ సుష్మా కిందపడింది. (    )
ఇ. శోభకు ఏడుపు రాలేదు. (  )
ఈ. శోభ మాత్రం నవ్వలేదు. (  )
ఉ. కిందపడ్డ పిల్ల సుష్మా. (    )


3. ఖాళీలను పూరించండి.

అ. శోభ......................వాళ్ళ ఇంటికి వెళ్ళింది.

ఆ. ఆ అమ్మాయి కూర్చోబోతూ ఉండగా, ఒక కొంటె పిల్ల 
కుర్చీ  .................

ఇ. ఆ అమ్మాయి ఏడుపు............................

ఈ. కిందపడ్డ అమ్మాయి పేరు ..............................


4. కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారు?


అ. " పాపం! ఆ అమ్మాయి చాలా బాధ పడ్డది".


ఆ. " ఆ అమ్మాయి ఎవరయితేనేంగాని మీరు అలా నవ్వకుడదే!"



ఈ క్రింది పదాలకు అర్ధాలు ఇంగ్లీషులో రాయండి. 

తమాషా

పలుకరించడం

కుతూహలం

సానుభూతి

ఎగతాళి

బిగపట్టుకోవడం

చప్పట్లు

కొంటె పిల్ల

చక్ర౦


No comments:

Post a Comment