Friday, December 27, 2013

మొత్తం బలం

ఒక బాలుడు, అతని తండ్రీ కలిసి చిట్టడివిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక చోట దారికి అడ్డంగా ఒక మొద్దు పడివుంది. ఆ బాలుడు తండ్రి వైపు తిరిగి, "నాన్నా, ఈ మొద్దును ఎత్తగలనా?" అని అడిగాడు. 
"నీకున్న బలాన్నంతా ఉపయోగిస్తే, తప్పకుండా ఎత్తగలవు." అని తండ్రి బదులిచ్చాడు. 

ఆ కుర్రవాడు చొక్కా చేతులు మడిచి, క్రిందికి వంగి, ఆ మొద్దు క్రిందికి చేతులు పోనిచ్చాడు. చేతులు బిగించి తనకున్న సత్తువనంతా ఉపయోగిస్తూ మొద్దుని లేపడానికి ప్రయత్నించాడు. కానీ ఆ మొద్దు ఇసుమంత కూడా కదల్లేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి అలిసిపోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

తండ్రి వైపు నిరుత్సాహంగా, నిరాశగా చూసి "నేను దీన్ని ఎత్తగలనన్నావ్!" అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న నవ్వుతూ సౌమ్యంగా "నీకున్న మొత్తం బలాన్ని ఉపయోగిస్తే ఎత్తగలవు అన్నాను. నన్ను సాయం పట్టమని నువ్వు అడగలేదు." అన్నాడు.

అప్పుడు ఆ కుర్రాడు తండ్రిని సాయం చెయ్యమని అడిగాడు, ఇద్దరూ కలిసి మొద్దుని దారి లోంచి పక్కకి పడేసారు.


నీతి: నీ బలం కేవలం నీలోనే లేదు, నీతో నడుస్తున్న వారిలో కూడా ఉంది. నీ ముందున్న పనికి నువ్వు సమవుజ్జీవి కాదనుకుంటున్నావంటే, నీకున్న బలాలన్నింటినీ నువ్వు ఉపయోగించుకోవట్లేదన్నమాట.

Source: http://unreasonable.is/opinion/a-30-second-story-to-remember-when-you-feel-inadequate

అనువాదం: వీవన్ వీరపనేని 

No comments:

Post a Comment