Friday, December 11, 2015

వార్షికోత్సవం అనగానే...

      పనులెప్పుడు మొదలెడదాం అంటూ వచ్చేశారు మా బృందమంతా..

      ఈ సంవత్సరమే పాఠశాలలో పాఠాలు చెప్పడం మొదలుపెట్టిన బింగు పద్మజ గారు "నేను కార్యక్రమ సమన్వయ కర్త బాధ్యతను తీసుకోవాలనుకుంటున్నాను కాని, ఇంతవరకూ నేను ఒక్క పాఠశాల వార్షికోత్సవమూ చూడలేదు. ఇంత పెద్ద పనిని చేయగలనా?" అన్న సందేహం వ్యక్తం చేశారు. "అసలు చెయ్యాలన్నఆలోచన రావడంతోనే మీ నాయకత్వ లక్షణాలు తేటతెల్లమౌతున్నాయి. వెనుక మేమంతా లేమూ" అని బాధ్యతను ఏకంగా ఆవిడ తల మీద పెట్టేశాము. మూడు నెలల పాటు మొయ్యవలసినదే. పాపం సహాయం కోసం వచ్చినప్పుడు మీ సహకారం అందిస్తారు కదూ!

      భోజన ఏర్పాట్లు చూస్తానని ఆనందంగా ముందుకు వచ్చిన వేలూరి రాధ గారితో "ఏమండోయ్ వీళ్ళు రెండు వేలు కూడా ఇవ్వకుండా సుమారుగా ఎనిమిది వందలమందికి పులిహోర, గొంగోరలతో అచ్చతెలుగు భోజనం పెట్టమంటున్నారు, కాస్త ఆలోచించుకోండి" అని పక్కవాళ్ళు హెచ్చరిస్తున్నా వినక, "మన పాఠశాల పేరెంట్స్ గురించి నాకు బాగా తెలుసండి. ఏం ఫరవాలేదు" అని ధీమాగా అనేశారు. "అంతా ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకునేవారే" అనుకునే ఈ రోజుల్లో, దానికి విరుద్దంగా మనష్యుల మీద మానవత్వం మీద ఆవిడకు అంత భరోశా ఏమిటో మరి! దండ హేమ గారు, అంబటి స్వప్న గారు, మలకపల్లి హేమంతి గారు వారికి సహాయం చేస్తామన్నారు.

        కార్యక్రమాలు, అంటే నాటికలు, పాటలు, పద్యాలు... ఇవన్నీ ఏ తరగతివారు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం, వారికి కావలసిన సలహా, సహాయం అందించడం. వేదిక దగ్గరుండి కార్యక్రమాలు నిర్వహించడం. ఇదీ పని. వినడానికి సరదాగా ఉంది కదూ! ఇరవై ఐదు తరగతులు చేయబోయే కార్యక్రమాల గురించి ముప్పై ఐదు మంది టీచర్లతో మాట్లాడుతూ ఒక పద్దతిలో కార్యక్రమాన్ని నడిపించడడం అంత తేలిక కాదు. అదృష్టవశాత్తూ ఆ పనిలో నిష్ణాతులైన సూరే మంజుల గారు ముందుకు రావడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం. ఆవిడా, మన ఉపాధ్యాయులు ఎలా చేస్తారో కాని మనం మాత్రం మంచి కార్యక్రమం చూశామని ఆ వార్షికోత్సవం సాయంత్రం తృప్తిగా అనుకోవాలి. మన పని కేవలం టీచర్ చెప్పిన వాటిని పిల్లలకు నేర్పించడం, వారిని అనుకున్న సమయానికి క్లాసుకు తీసుకువెళ్ళడం అంతే! మేడికాయల లక్ష్మి గారు ఆవిడకు సహాయం చేస్తామన్నారు.
       కోశాధికారిగా కదిరిసెట్టి తమ్మారావు గారు ఈ ఏడాది పాఠశాలకు సంబంధించిన ఖర్చులు,లెక్కలు, కూడికలూ, తీసివేతలు లాంటి పనులన్నీ వారివే. 

ఇవి కాక

      శుభకార్యానికి పసుపు కొట్టడం లాంటి పని వార్షికోత్సవానికి కావలసిన హాల్ వెతికి బుక్ చెయ్యడం. దేవినేని నీలిమ గారు ఆ బాధ్యత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. గతంలో కోశాధికారిగా ఆవిడ ప్రతిభ జగద్విదితమే. తనకో పనిచ్చి మనం మరచిపోయనా మన వెంట పడి మరీ ఇచ్చిన దానిని విజయవంతంగా పూర్తి చేయగలరు. బహుమతుల కొనుగోలు వ్యవహారం కూడా ఆవిడే చూసుకుంటానన్నారు. కల్యాణి పుల్లేటి గారు ఆవిడకు సహాయం చేస్తామన్నారు.

      బానర్ డిజైన్ అనగానే మనం రెండో మాట లేకుండా కొత్త రఘునాథ్ గారు అనేసుకుంటాం. ఒకటేమిటి లెండి ఇక్కడ అక్కడ అనిలేక ఎక్కడ అవసరమైనా ఆయనే ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే పాఠశాలకు సంబంధించి సర్వాంతర్యామి. ఈ సారి ఎరగుడిపాటి శ్రీవాణి గారు ఆ బాధ్యత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. కొత్తగా వచ్చినా ఉపాధ్యాయులందరికీ శ్రీవాణి గారు పరిచయస్తులే. ఆవిడ గురించి చెప్పాలంటే ఇందు గలరు అందు లేరు..ఎందెందు వెతికినా .. అనే పద్యం సరిపోతుంది.

     విద్యార్ధుల కోసం ట్రోఫీలు, సర్టిఫికేట్లు తెప్పించే బాధ్యత వేమూరి సత్య గారు, ఫోటోలు, వీడియోలు తీయడం, తీయించడం లాంటి బాధ్యతలు గూడె మురళి మనోహర్ గారు తీసుకున్నారు. వారివురు ముందుకు రాగానే సమావేశంలో కలకలం. పోయిన ఏడాది వార్షికోత్సవం నాడు వారు చేసిన పని ఇంతా అంతా కాదుట. తెర వెనుక ఎక్కడ చూసినా వాళ్ళేనట. కొండమడుగు శివ గారు, దండ గోవిందరావు గారు మురళి గారికి సహాయం చేస్తామన్నారు.

     సమావేశానికి హాజరుకాలేక పోయినా మేడికాయాల నరసింహ గారు స్పీకర్స్, మ్యూజిక్ సిస్టం గురించి అన్ని వివరాలు తాను చూసుకుంటానని చెప్పి పంపించారు. కొండమడుగు శివగారు వారికి సహాయం చేస్తామన్నారు.

    "ఇతరత్రా ఏ సహాయం కావాలన్నా నేనున్నా" అన్నారు కింతలి అనురాధ గారు. ఆవిడ ఇంకో మాట కూడా అన్నారండోయ్. ఈ సమావేశం జరిగిన తరువాత రోజు ఉదయాన్నే ఫోన్ చేసి "ఏ పార్టీలో కూడా ఇంతలా ఎంజాయ్ చెయ్యలేదు, భలేగా జరిగింది సమావేశం" అని ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.

     హాలు శుభ్రత విషయంలో తను బాధ్యత తీసుకుంటానన్నారు మురళి మోహన్ గారు. తన్నీరు లక్ష్మీ రాజేశ్వరి గారు సమావేశానికి హాజరైన ఇరవై మందికి సరిపడా రుచికరమైన ఫలహారాలు స్వయంగా చేసుకుని తీసుకువచ్చారు. 


    వీరు కాక ఇంకా చాలామంది ఈ సమావేశానికి రాలేకపోతున్నామని ఏ సహాయం చేయడానికైనా సిద్దమేనని మెయిల్, ఫోన్ ద్వారా తెలియజేశారు.

     ఇంతమంది నిస్వార్ధంగా కృషి చేస్తుండబట్టే పాఠశాల వార్షికోత్సవం ప్రతి ఏడాది విజయవంతంగా జరుగుతోంది. 

ఎందరో మహానుభావులు. అందరికీ వందనం

Tuesday, August 18, 2015

పాఠశాల 2015- 2016

      పాఠశాల ఏడవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ ఏడాది సౌత్ షార్లెట్ లోనూ, నార్త్ చార్లెట్ లోనూ ఓపెన్ హౌస్ ఏర్పాటు చేశాము. సుమారుగా వందమందికి పైగా తల్లిదండ్రులు హాజరయ్యారు, ఎనభై మంది విద్యార్ధులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ముప్పైఆరు మంది ఉపాధ్యాయులు ఈ ఏడాది పాఠాలు చెప్పడానికి ముందుకు వచ్చారు. ఈ ఏడాది సుమారుగా రెండు వందల మంది విద్యార్ధులతో పాఠశాల తరగతులు మొదలవబోతున్నాయి. 

తరగతులు జరుగు ప్రదేశాలు 
బాలంటైన్ ఏరియా (13 తరగతులు)
స్టీల్ క్రీక్ (ఒక తరగతి)
హంటర్స్ విల్ (2 తరగతులు)
నార్త్ షార్లెట్ (2 తరగతులు)
యూనివర్సిటీ ఏరియా (ఒక తరగతి)
మూర్స్ విల్ (ఒక తరగతి)
స్టీల్ క్రీక్  (2 తరగతులు)
ట్రయాన్ స్ట్రీట్ (ఒక తరగతి)
హారిస్ బర్గ్ (ఒక తరగతి)


కొలబియా, సౌత్ కెరొలినా (3 తరగతులు)
రాలీ, నార్త్ కెరొలినా (ఒక తరగతి) 

ఈ ఏడాది మా ఉపాధ్యాయులు 


రాధ వేలూరి, మంజుల సూరే, ఉష పడాల, ఉష పారుపూడి, అనురాధ కింతలి, కవిత చదా, హరిత సూర్యదేవర, లక్ష్మి కంచెర్ల, జ్యోతి సుంకే, భాను ప్రకాష్ గండ్లూరి, సుధ గుమ్మడి, శశికాంత్ మల్లాది, పద్మ బులుసు, శైలజ డోకి, ఈశ్వరి ఎడపల్లి, లక్ష్మి మేడికాయల, రాజ చదలవాడ, లక్ష్మి వాస, రాజ్ చదలవాడ, శారద నూకల, స్వప్నిక పాలకోడేటి, సునీత సంక్రాంతి,  విజయలక్ష్మి కోమలి, గాయత్రి మారెళ్ళ , పద్మజ విస్సంరాజు, రాణి మద్దినేని, లక్ష్మి రాజేశ్వరి తన్నీరు, మమత కొండమడుగుల, శ్రీ హరి చెక్క
శ్వేత గనపం, 
శిఫాలి, అరుణ, మాలతి కొట్టె, పద్మజ బింగు, హరి చెక్క, వంశీ అల్లూరి   


విద్యార్ధులను నమోదు చేయదలచిన వారు ఈ పత్రము పూర్తి చేయండి. 
వివరాల కొరకు paatasalausa@gmail.com కు మెయిల్ పంపించండి. 

Friday, May 1, 2015

ఆరవ వార్షికోత్సవం

        పాఠశాల మొదలుపెట్టి ఆరు సంవత్సరాలు పూర్తయిందంటే నమ్మశక్యంగా లేదు. తెలుగులో ఒక్క అక్షరం పలకలేని పిల్లలు ఈరోజు మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మొదలు పెట్టినప్పుడు పుస్తకాలు లేవు, ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో తెలీదు. అలాంటిది ఇవాళ మాకై మేము సొంతంగా పాఠ్యాంశాలను రూపొందించుకుని పాఠాలు చెప్పగలగడమే కాక, పాఠాలు చెప్పాలన్న ఉత్సాహంతో ముందుకు వచ్చిన వారికి ప్రణాళిక ఇవ్వగలిగే స్థాయికి వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. 

ఇన్ని సంవత్సరాలు అర్ధరాత్రి, అపరాత్రి అని లేక ఫోన్ చేసినా విసుక్కోక నన్ను భరించి నాతో నడిచిన ఉపాధ్యాయులు, మీరివన్నీ మీ పిల్లలతో చేయించాలంటే ఎందుకు ఏమిటి అని అడక్కుండా తూ. చా. తప్పకుండా పాటించిన తల్లిదండ్రులు, పద్యాలు, పాటలు, ఆటలు, మాటలు అన్నీ నేర్చిన చిన్నారులు, నాలుగు తరగతులు పూర్తి చేసి పాఠశాలను ప్రగతి పథం వైపు నడిపిస్తున్న పట్టభద్రులు అందరూ ఈ విజయంలో భాగస్వాములే. 


ఆరవ వార్షికోత్సవం విశేషాలు ఇక్కడ చూడొచ్చు. . 

Wednesday, April 29, 2015

ఐదవ వార్షికోత్సవం/నేనెరిగిన పంచభూతాలు

"వార్షికోత్సవం ఈ సంవత్సరం......" 
""చేద్దాం చేద్దాం" పిల్లలదీ పెద్దలదీ ఒకటే మాట.
"ఎలాగా? పోయినేడాది లాగానేనా"
"అబ్బే, పోయిన సంవత్సరం మన పాఠశాల వాళ్ళమే చేసుకున్నాం తప్ప వేరే వాళ్ళను పిలవలేక పోయాం. ఈ సంవత్సరం అలా కాదు ఆసక్తి ఉన్న స్నేహితులను కూడా పిలుద్దాం"
"మనమే దగ్గరదగ్గరగా నలభై ఐదు కుంటుంబాలు. క్లబ్ హౌస్ సరిపోదు.మరి ఎక్కడ చేద్దాం? "
"ఏదైనా స్కూల్ తీసుకుందా౦"
స్కూల్ గురించి వేట మొదలైంది. కనుక్కుంటే తెలిసిందేమిటంటే రెంట్ తక్కువే ఉంది కాని ఇన్సురెన్స్ చాలా ఎక్కువ. వెంకట్ గొట్టిపర్తి గారు ఆ సమస్య తీర్చేసి కమ్యూనిటీ హౌస్ మిడిల్ ఇప్పించేశారు. మార్చ్ పదహారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కార్యక్రమం మొదలైయేట్లుగా నిర్ణయమైంది. 

"అందరినీ ఆహ్వానించడానికి మరి ఆహ్వాన పత్రిక.."
"మేం చేస్తాం" ఉత్సాహంగా ముందుకు వచ్చారు మురళి గారు, రామకృష్ణ గారు. చెప్పినట్లుగానే అందమైన ఆహ్వాన పత్రిక తాయారు చేశారు. తమ్మా రావు గారు ఆ పత్రికకు తుది మెరుగులు దిద్దారు. 
ఆ పత్రికను అందరికీ పంపించి పేరు పేరునా ఆహ్వానించారు శేఖర్ గారు.

"ఈ కార్యక్రమానికి వ్యాఖ్యత ఉంటే బావుంటుంది."
"వెంకట్ గారు" టక్కున చెప్పారు కొందరు. 
సమయస్ఫూరితో అలవోకగా చెప్పిన  ఆయన వ్యాఖ్యానం నిన్నటి కార్యక్రమానికి ఓ విశిష్టతను చేకూర్చింది.  

"అతిధులను ఆహ్వానించడానికి ఎమైనా ఏర్పాట్లు చేస్తే బావుంటుంది"
"ఆ పని మేము తీసుకుంటాం. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ మేం చేస్తాం" ముందుకొచ్చారు" రాజశ్రీ, లక్ష్మి.
"మన నాలుగవ తరగతిలో ఉన్నారుగా పెద్ద పిల్లలు వాళ్ళను అక్కడ ఉండమంటే బావుంటుందేమో!"
"అలాగే చేద్దాం"
అనన్య, శివానీ, నేహ సాంప్రదాయ సిద్దంగా అలంకరించుకుని, వచ్చిన వాళ్ళను సాదరంగా ఆహ్వానించారు.

"ఈ కార్యక్రమానికి ఫోటోలు ఎవరు తీస్తారు?"
"ఫణి గారు, రామకృష్ణ గారు ఫోటోలు బాగా తీస్తారు"
వారిద్దరూ అతిధులకు సకుంటుంబ సమేతంగా ఫోటోలు తీసేరు. అలాగే కార్యక్రమంలోని అన్ని విశేషాలను వారి కెమెరాలలో బంధించారు. 
రఘు గారు, వీరా గారు, శ్రీనివాస్ గారు, రాం కుమార్ గారు అన్ని కార్యక్రమాలకు ఓపిగ్గా వీడియో తీశారు.

"మరి వేదిక అలంకరణ, హాల్ అలంకరణ ఏర్పాట్లన్నీ చెయ్యాలిగా..."
"వేదిక కోసం ఇండియా నుండి ఫ్లెక్సీ తెప్పింద్దాం."
"ఇండియానుండంటే తెప్పించడం కష్టమౌతుందేమో!"
"మీకెందుకు నేను తెప్పిస్తాగా" నమ్మకంగా చెప్పారు శైలజ. 
"మరి మిగిలినవన్నీ?"
"మేం చేస్తాం" ఉత్సా౦హంగా ముందుకు వచ్చారు కళ్యాణి, వకుళ, నరసింహ గారు, సనత్ గారు
"ఐదు తరగతులకూ వెళ్ళి ఫోటోలు తీసి అన్నీ ఒక పోస్టర్ లో అంటించి అక్కడ అలకరిద్దాం"
"వేదిక మీద ఫ్లెక్సీ పెట్టాక మిగిలినవి అక్కర్లేదు. ఎలాగూ ఐదు క్లాసుల ఫోటోలు తీస్తున్నాం, పిల్లల పేర్లు రాసి ఆ తరగతులలో చెప్పే పాఠ్యాంశాలు కూడా అందులో జత చేసి పోస్టర్ చేద్దాం. ఏమంటారు?"
"మంచి ఆలోచన"
అనుకున్నట్లుగానే అన్ని తరగతులకూ వెళ్ళి ఫోటోలు తీసి, అవన్నీ రంగు రంగుల పోస్టర్ మీద అందంగా అమర్చి హాల్లో అలంకరిచారు వకుళ, కళ్యాణి.

"పిల్లలందరూ ఇలా కష్టపడి తెలుగు నేర్చుకుంటున్నారు. వాళ్ళకు ట్రోఫీలు ఇస్తే బావుంటుంది."
"పాసయిన వాళ్ళకు సర్టిఫికెట్లు కూడా"
"అలాగే" 
"సర్టిఫికెట్లు నేను చేస్తాను" రఘు చెప్పారు.
"నేను ప్రింట్ చేయిస్తాను" నవీన్ గారు ముందుకొచ్చారు.
"టీచర్లకు కూడా జ్ఞాపిక ఇస్తే బావుంటుంది." టీచర్ల పరోక్షంలో గుసగుసలు.
"ఒక పని చేద్దాం, అన్ని తరగుల ఫోటోలు తీశాం కదా! జ్ఞాపిక అలా ఫోటోతో తయారుచేద్దాం" వెంకట్ గారి సలహా. 
"మంచి ఆలోచన"
"ఈ ట్రోఫీలు, జ్ఞాపికలు తయారుచేసే వాళ్ళు నాకు తెలుసు. అవన్నీ నేను చూసుకుంటాను" వెంకట్ గారు భరోసా ఇచ్చారు. 
తల్లిదండ్రులు, వారి పిల్లల ఉపాధ్యాయులకు జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. ఈ ఏడాది ఉపాధయులకు అవసరమైన సహాయం చేస్తూ వచ్చే ఏడాది నుండి పాఠాలు చెప్పడానికి నిర్ణయించుకున్న ఉష, కవితలు వేదిక మీద పుష్పగుచ్చం అందుకున్నారు. విద్యార్ధులందరూ అందమైన పాఠశాల లోగోతో, వాళ్ళ పేర్లు రాసి వున్న ట్రోఫీలను, సర్టిఫికెట్లను వారి టీచర్ల చేతుల అందుకున్నారు.  


"మీ తరగతులలో తీసిన ఫోటోలు, వీడియోలు ఏమైనా ఉంటే చూడండి" నవీన్ గారు, రఘు తరగతి వీడియో చేసి వేదిక ప్రదర్శించడానికి సంకల్పించారు.
"తరగతిలో ఎప్పుడూ ఫోటోలు తీయలేదు కాని, పిల్లలతో వేయించిన నాటికలు, వారు పాడిన పాటలు, వాళ్ళతో సంక్రాంతికి, వినాయక చవితికి బొమ్మలు చేయించినప్పటి ఫోటోలు కూడా ఉన్నాయి."
"అయితే ఒక పని చేద్దాం అవి కొన్ని పెట్టి, ఈ పిల్లల ఇంటి దగ్గర తీసిన వీడియోలు పంపమని అడుగుదాం" 
ఆ విధంగా వీడియో రూపుదిద్దుకుంది. అచ్చమైన తెలుగులో పిల్లల సంభాషణలు, ఉపాధ్యాయుల కోసం వారు చెప్పిన శ్లోకాలు, పాడిన పాటలు, వినూత్న రీతుల్లో వారు చెప్పిన పద్యాలు. ఇంట్లోనే కాకుండా బయటకు వెళ్ళినప్పుడు వారు చెప్పిన కూరగాయల పేర్లు. ఇలా ఎన్నో ఎన్నెన్నో....ఆ వీడియో నిన్న చూసినప్పుడు పిల్లాల్ని చూసి ముచ్చటేసింది. తల్లిదండ్రులకు తెలుగు నేర్పించడం పట్ల ఉన్న ఉత్సాహం చూసి చాలా సంతోషంగా అనిపించింది. 

"మరి సాయంత్రం అంటున్నాం. భోజనాలో...."
"మీకెందుకు మేమున్నాం" భరోసా ఇచ్చేసారు రజని, ప్రియ, జ్యోతి, రంజని, రామారావ్ గారు, సత్య గారు. వాళ్ళే ప్రణాళిక సిద్దం చేసి, అందరినీ సంప్రదించి అందరూ తలా ఒక ట్రే కూరో, బిర్యానీనో, స్వీటో, పచ్చడో తెచ్చేట్లుగా చూసుకున్నారు. ఏ షాపులు తిరిగారో ఎలా చేసారో కాని కావలసిన వస్తువులన్నీ లోపం రానేయకుండా సమకూర్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఉత్సాహంగా ముందుకు వచ్చిన తల్లిదండులందరి సహకారంతో షడ్రశోపేతమైన విందు భోజనం వేడివేడిగా వడ్డించారు.

"అంతా బాగానే ఉంది. మరి పిల్లల కార్యక్రమాలు ఏం చేద్దాం?"
"ఎవరి తరగతి పిల్లలతో వాళ్ళం చేయిస్తా౦" చెప్పేరు టీచర్లు.
"మీకెటువంటి సహాయం కావాలన్నా మాకు చెప్పండి" అంటూ తల్లిదండ్రులందరూ నిండు మనసులో చెప్పారు. 

ఈ మొత్తం కార్యక్రమ౦లో మా టీచర్లు రాధ, లావణ్య, స్నేహ, సుమతి, మంజుల, శైలజ, రాజశ్రీ, అనురాధ, రఘు చేసిన కృషి మరువలేనిది. నాటికలు వేయించారు. పద్యాలు, శ్లోకాలు చెప్పించారు, పాటలు పాడించారు. స్వాతంత్ర్య సమార యోధులను వేదిక మీదకు తీసుకుని వచ్చి "వీరెవరో చెప్పుకోండి చూద్దాం" అని ప్రేక్షకులకు పరీక్ష పెట్టారు. "ఎవరు నిజమైన అందెగత్తో" చూపించారు. మెంతులు, అవలతో మాట్లాడించారు. కలి చేయిస్తున్న అరాచకాల గురించి పిల్లలకు పెద్దలకు అర్ధమయ్యే రీతిలో వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో... 

ఇందులో పెద్దవాళ్ళ పాత్ర కూడా తక్కువేమీ కాదండోయ్. ఐదు, ఆరేళ్ళ పిల్లలతో అసభ్యకరమైన పాటలు పాడి౦చి అదే ఘనకార్యం అన్నట్లు చప్పట్లు కొట్టి మురిసి పోతున్న ఈ రోజుల్లో "అమ్మా కథ చెప్పవే" అంటూ మనసు కదిలించే పాటలు, "అందమైనది భారతమూ, మన భారతమూ" అనే దేశభక్తీ గీతం, చిట్టి చిట్టి మిరియాలు అనే చిన్నచిన్న పాటలు నేర్పించి కార్యక్రమానికి వన్నె తెచ్చారు. 

ప్రతి తరగతికీ ఆ తరగతిలోని పిల్లలే వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం మరో విశేషం. వచ్చీరాని తెలుగులో ఏదో చెప్పుంటారు అనుకుంటున్నారేమో, కాదండీ. స్పష్టమైన తెలుగులో చక్కగా మాట్లాడారు. 

"పెద్దవాళ్ళకు కూడా ఏమైనా కార్యక్రమం ఉంటే బావుంటుంది."  
"తప్పకుండా చేద్దాం"
"ఏమైనా క్విజ్ పెడదామా?"   
లావణ్య, సనత్ గారు, శైలజ కలసి సాహిత్యం, వినోదం, చరిత్ర ఇలా కొన్నింటి మీద రకరకాల ప్రశ్నలు వేసి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. 

"పాఠశాల ఐదవ వార్షికోత్సవం చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి."
"మీరంతగా చెప్పాలా, తప్పకుండా వస్తాం. పాఠశాల గురించి తెలుసుకోవాలని మాకూ ఆసక్తిగా ఉంది"
మేము పిలిచినా ప్రతివారూ ఇదే సమాధానం. ముఖస్తుతి మాటలు కదండీ. ఇచ్చిన మాట ప్రకారం వారి అమూల్య సమయాన్ని వెచ్చించి, ఆద్యంతం ఈ చిన్నారుల కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించి, దీవెనలు అందిచారు. 

ఎన్నో అనుకుంటాం. ఏవేవో కలలు కంటాం. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ పంచభూతాలు మనకు అండగా నిలుస్తాయిని ఎక్కడో చదివాను. ఆ పంచభూతాల సంగతేమొ తెలియదు కాని, ఈ ప్రయత్నానికి అంటే ఈ కార్యక్రమానికి మాత్రమే కాదు, భాషాభివృద్ది కోసం కూడా పాటుపడుతున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తిగా నేర్చుకుంటున్న విద్యార్ధులు, వాళ్ళను ప్రోత్సహించడానికి విచ్చేసిన అతిధులు అందరూ ఆ పంచభూతాలకంటే కూడా ఉన్నతంగా కనిపిస్తున్నారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 

సమస్య ఉంటుంది. సమస్యను గురించి పదిరకాలగా  చెర్చలు చేస్తూ సమయం వృధా చేయకుండా పరిష్కారం అలోచించి, ఆ వైపుగా పయనించిస్తే ఎన్నో ఆణిముత్యాలు దొరుకుతాయి. ఆ ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు వెలకట్టలేనివి. ఎప్పుడైతే నేను, నాది అనే చట్రంలో పడతామో అన్నీ కోల్పోతాం. ఆఖరికి మనకి మనమే ఏమీ కాకుండా అయిపోతాం.  

ఊహించని రీతిలో ఈ కార్యక్రమాన్ని జరిపించిన ఇంతమంది సహృదయుల మధ్య ఉండడం ఎన్ని జన్మల సుకృతమో!

5వ వార్షికోత్సవం వీడియోలు 


యాంకర్ వెంకట్ గారి మాటల్లో ఉపాధ్యాయులు రఘు, జ్యోతిర్మయి, మంజుల, రాజశ్రీ, రాధ, అనురాధ, స్నేహ, సుమతి, లావణ్య, శైలజ  ఏమంటున్నారంటే 

Monday, September 8, 2014

కథలు

ఒకటవ తరగతి కథలు 
 1. "టీ కప్పు ఆత్మ కథ" ---  స్వేచ్చానువాదం చిన్ని 
 2. బద్దకం నుండి విముక్తి  --- పి పుల్లారావు 
 3. "గాడిద గర్వం" 
 4. "ఉపాయం"  
 5. "కోతలు కోసిన కోయిల". --- గుడిపూడి రాధికా రాణి 
 6. "కోడిపుంజు తెలివి". 
 7. "కట్టెలు కొట్టువాడు బంగారు గొడ్డలి". .
 8. "కనువిప్పు"
 9. "మూడు బొమ్మలు".---- చిరంజీవి సుభాష్ 
 10. "కోపం వచ్చిన చీమ".---- చిరంజీవి షర్మిల 
 11. ఈగ.  
 12. "కుదురులేని కుంకుడు గింజ". గుడిపూడి రాధికా రాణి 
 13.  షికారులో నంబర్లు. ----- రాధ మండువ (కథ సరదాగా ఉండడమే కాకుండా, బొమ్మలతో చాలా అందంగా కూడా ఉంది. పిల్లలకు చూపించండి.)
 14. మంచి విత్తనాలు  --- నారంశెట్టి ఉమామహేశ్వర రావు 
 15. "వెలిగిన మిణుగురులు". ---- గుడిపూడి రాధికా రాణి.
 16. ఈ వారం కథ "పాఠం-గుణపాఠం" ----- దార్ల బుజ్జిబాబు.
 17. బడాయి రాయి ----గుడిపూడి రాధికా రాణి
 18. వెర్రిబాగుల వేరుశనగ కాయ   ---  గుడిపూడి రాధికా రాణి
 19. మామ్మకో మనవడు   -----  గుడిపూడి రాధికా రాణి
 20. కోడి కోరిక  గుడిపూడి రాధికా రాణి
 21. నాన్నకిచ్చిన కానుక  సువర్చల 
రెండవ తరగతి కథలు
 1. ఇరుకిల్లు   ---- గుడిపూడి రాధికా రాణి
 2. సుబ్బయ్య సున్నుండలు --- శాఖమూరి శ్రీనివాస్  
 3. కొబ్బరికాయల తీర్పు
 4. మనకోసం మనం  కథ: ప్రభా గాయత్రి బొమ్మలు ఆదిత్య
 5. నిర్ణయం  పివి సాయి సోమయాజులు  (అందరూ ఇలా ఆలోచిస్తే ఎంత బావుంటుందో)
 6. కోడలి దానగుణం  ---- గుడిపూడి రాధికా రాణి
 7. నమ్మకస్తుడు   ---- నందిరాజు పద్మలతా జయరాం 
 8. గడ్డిపూవు మల్లెమొగ్గ  ---- గుడిపూడి రాధికా రాణి
 9. పంచదార పిల్లి   ---- గుడిపూడి రాధికా రాణి
 10. వివేకుడి తెలివి  ---- నారంశెట్టి ఉమామహేశ్వర రావు
 11. అసలైన వజ్రం  ---- గుడిపూడి రాధికా రాణి
 12. చక్కని చుక్కలు --- గుడిపూడి రాధికా రాణి
 13. అందాల పక్షీ! నిజం తెలిసిందా? --- సి వి సర్వేశ్వర శర్మ 
 14. అదే అసలు ప్రత్యేకత --- ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి 
 15. అల్లరి చీమకు బుద్దొచ్చింది -- పుట్టగుంట సురేష్ కుమార్ 
 16. ఒక్క అవకాశం --- చొక్కాపు వెంకట రమణ 
 17. మారిన కోతి ----- రామకృష్ణ పైడిమర్రి (మనదాకా వస్తే ఎలా అలోచిస్తామో ఈ కథలో బాగా చెప్పారు)
 18. సమానం   ---- రాధికా కృష్ణ (సమానత్వం మీద కథ)
 19. మనసులోని మాలిన్యం ------- రాజేష్ యాళ్ల  కథ చివర్లో అతనికంటే బాగా కంటే నువ్వు ఇంకా బాగా అని చెప్తే మంచిది. అతనికంటే అనే పోలికే అసూయకు మొదటి మెట్టు.
మూడు నాలుగు తరగతుల కథలుపిల్లల చదవగలిగిన చక్కని కథలు
 1. విజయం ఒక మజిలీ  నల్లాన్ చక్రవర్తుల గోపీ మాధవ్ లు
 2. పుణ్య కార్యం   జయదేవ్ గారి కార్టూన్స్ తో ఆసక్తిగా ఉందీ కథ
 3. ధర్మం  కథ మాధుర్య, బొమ్మలు ఆదిత్య
 4. మనకోసం మనం  కథ: ప్రభా గాయత్రి బొమ్మలు ఆదిత్య (చదివి తీరాల్సిన కథ) 
 5. హాపీ డేస్ నారంశెట్టి ఉమామహేశ్వర రావు 

వీడియో కథలు కోడిపిల్ల కథ
పంచతంత్ర కథలు
కదిలే బొమ్మ (బొమ్మల సినిమా)
అమ్మా నాన్నకు ప్రేమతో
హై స్కూల్
జల్సా కథThursday, August 7, 2014

పాఠశాల తరగతులు ప్రారంభం

ఏ ఇద్దరి మధ్యైనా సత్సంబంధం ఉండాలంటే బాంధవ్యం ఒక్కటే సరిపోదు, అనురాగం ఉండాలి, దాన్ని తెలియజేసే భాష రావాలి. మన పిల్లలను చూడాలని, వారితో సంతోషంగా కాలం గడపాలని ఎంతో ఆశతో వచ్చే తల్లిదండ్రులకోసం, వారి ఆప్యాయతను పిల్లలకు చవిచూపించాలనే తపనతోనూ మొదలైనదే ఈ ‘పాఠశాల’.

ఐదేళ్ళ క్రితం తెలుగు తరగతి మొదలెట్టినప్పుడు, పుస్తకాలు లేవు. పిల్లలకు ఎలా చెపితే ఆసక్తిగా నేర్చుకుంటారో తెలియదు. కాని ఇప్పుడు పూర్తిగా ఆంగ్ల వాతావరణంలో పెరుగుతున్న పిల్లలకు తెలుగుమీద ఆసక్తి కలిగించడంలో కృతకృతులమయ్యామని గర్వంగా చెప్పుకోవచ్చు.

ఔత్సాహికులైన తల్లిదండ్రులు తెలుగు బోధించడానికి ముందుకు రావడంతో పదిమందితో మొదలైన పాఠశాలలో ప్రస్తుతం యాభైయ్యారు మంది విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారు. ఈ తరగతులకు కావలసిన పాఠ్యప్రణాళికలన్నీ అందరికీ అందుబాటులో ఒకే దగ్గర ఉండాలని ఈ బ్లాగు మొదలుపెట్టడం జరిగింది. వినాయక చవితికి, సంక్రాంతికి  పిల్లలు చేసిన బొమ్మలు, నాలుగవ తరగతి విద్యార్ధులు  రాసిన ఉత్తరాలు, వ్యాసాలు, పిల్లలు వేసిన నాటికలు, వారు పాడిన పాటలు, పద్యాలు, వార్షికోత్సవం విశేషాలు అన్నీ ఇక్కడే పొందుపరిచాము. 

పాఠశాలలో విద్య పూర్తిగా ఉచితం. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. మీ ప్రాంతంలో పాఠశాల తరగతులు మొదలు పెట్టాలనుకున్నా, పాఠశాలో బోధించాలనుకున్నా, లేదా మీ పిల్లలను పాఠశాలలో చేర్పించాలనుకున్నా దయచేసి paatasalausa@gmail.com మెయిల్ చేయండి. పాఠాలు చెప్పడానికి కావలసిన పాఠ్య ప్రణాళికలు, పరిక్షా పత్రాలు అన్నీ అందజేయబడతాయి. ఉపాధ్యాయులు వారానికో గంట సమయం వెచ్చించగలిగితే చాలు.

ఆగస్టు 9 వ తేదీ శనివారం మధ్యాహ్నం 3గంటలకు ఉపాధ్యాయుల సమావేశం, ఆగస్టు 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తల్లిదండ్రుల సమావేశం జరుగుతాయి.

ఓ మదిలో మెదిలిన ఆలోచన వేళ్ళూనుకుని నేడు ఒక వృక్షంలా వెల్లివిరిసింది. రేపు నందనవనంలా విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నాము. 

ధన్యవాదములతో,
పాఠశాల ఉపాధ్యాయులు


                                                       

Sunday, May 4, 2014

మీ పిల్లలకు తెలుగు నేర్పించాలనుకుంటున్నారా..

రేపటి నుండి పాఠశాలకు వేసవి సెలవలు. మళ్ళీ సెప్టెంబర్  7 న కొత్త సంవత్సరం మొదలౌతుంది. ఆగస్టు 24 న విద్యార్దులందరూ ప్రవేశ పరీక్ష వ్రాయాలి. వారి మార్కులను బట్టి వారు ఏ తరగతిలో ఉండాలో ఉపాధ్యాయులు నిర్ణయిస్తారు. 

పాఠశాలలో విద్య పూర్తిగా ఉచితం. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. వార్షికోత్సవానికి, పిల్లలకు ఇచ్చే బహుమతులకు ఈ సంవత్సరం నలభై ఐదు డాలర్లు ఖర్చయింది. వచ్చే సంవత్సరం నుండి పుస్తకాలు ముద్రించడంకోసం అదనపు ఖర్చు ఉంటుంది. 

మీ ప్రాంతంలో పాఠశాల తరగతులు మొదలు పెట్టాలనుకున్నా, పాఠశాలో బోధించాలనుకున్నా, లేదా మీ పిల్లలను పాఠశాలలో చేర్పించాలనుకున్నా దయచేసి paatasalausa@gmail.com మెయిల్ చేయండి. పాఠాలు చెప్పడానికి కావలసిన పాఠ్య ప్రణాళికలు, పరిక్షా పత్రాలు అన్నీ అందజేయబడతాయి. ఉపాధ్యాయులు వారానికో గంట సమయం వెచ్చించగలిగితే చాలు.