Showing posts with label వార్షికోత్సవం. Show all posts
Showing posts with label వార్షికోత్సవం. Show all posts

Friday, December 11, 2015

వార్షికోత్సవం అనగానే...

      పనులెప్పుడు మొదలెడదాం అంటూ వచ్చేశారు మా బృందమంతా..

      ఈ సంవత్సరమే పాఠశాలలో పాఠాలు చెప్పడం మొదలుపెట్టిన బింగు పద్మజ గారు "నేను కార్యక్రమ సమన్వయ కర్త బాధ్యతను తీసుకోవాలనుకుంటున్నాను కాని, ఇంతవరకూ నేను ఒక్క పాఠశాల వార్షికోత్సవమూ చూడలేదు. ఇంత పెద్ద పనిని చేయగలనా?" అన్న సందేహం వ్యక్తం చేశారు. "అసలు చెయ్యాలన్నఆలోచన రావడంతోనే మీ నాయకత్వ లక్షణాలు తేటతెల్లమౌతున్నాయి. వెనుక మేమంతా లేమూ" అని బాధ్యతను ఏకంగా ఆవిడ తల మీద పెట్టేశాము. మూడు నెలల పాటు మొయ్యవలసినదే. పాపం సహాయం కోసం వచ్చినప్పుడు మీ సహకారం అందిస్తారు కదూ!

      భోజన ఏర్పాట్లు చూస్తానని ఆనందంగా ముందుకు వచ్చిన వేలూరి రాధ గారితో "ఏమండోయ్ వీళ్ళు రెండు వేలు కూడా ఇవ్వకుండా సుమారుగా ఎనిమిది వందలమందికి పులిహోర, గొంగోరలతో అచ్చతెలుగు భోజనం పెట్టమంటున్నారు, కాస్త ఆలోచించుకోండి" అని పక్కవాళ్ళు హెచ్చరిస్తున్నా వినక, "మన పాఠశాల పేరెంట్స్ గురించి నాకు బాగా తెలుసండి. ఏం ఫరవాలేదు" అని ధీమాగా అనేశారు. "అంతా ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకునేవారే" అనుకునే ఈ రోజుల్లో, దానికి విరుద్దంగా మనష్యుల మీద మానవత్వం మీద ఆవిడకు అంత భరోశా ఏమిటో మరి! దండ హేమ గారు, అంబటి స్వప్న గారు, మలకపల్లి హేమంతి గారు వారికి సహాయం చేస్తామన్నారు.

        కార్యక్రమాలు, అంటే నాటికలు, పాటలు, పద్యాలు... ఇవన్నీ ఏ తరగతివారు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం, వారికి కావలసిన సలహా, సహాయం అందించడం. వేదిక దగ్గరుండి కార్యక్రమాలు నిర్వహించడం. ఇదీ పని. వినడానికి సరదాగా ఉంది కదూ! ఇరవై ఐదు తరగతులు చేయబోయే కార్యక్రమాల గురించి ముప్పై ఐదు మంది టీచర్లతో మాట్లాడుతూ ఒక పద్దతిలో కార్యక్రమాన్ని నడిపించడడం అంత తేలిక కాదు. అదృష్టవశాత్తూ ఆ పనిలో నిష్ణాతులైన సూరే మంజుల గారు ముందుకు రావడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం. ఆవిడా, మన ఉపాధ్యాయులు ఎలా చేస్తారో కాని మనం మాత్రం మంచి కార్యక్రమం చూశామని ఆ వార్షికోత్సవం సాయంత్రం తృప్తిగా అనుకోవాలి. మన పని కేవలం టీచర్ చెప్పిన వాటిని పిల్లలకు నేర్పించడం, వారిని అనుకున్న సమయానికి క్లాసుకు తీసుకువెళ్ళడం అంతే! మేడికాయల లక్ష్మి గారు ఆవిడకు సహాయం చేస్తామన్నారు.
       కోశాధికారిగా కదిరిసెట్టి తమ్మారావు గారు ఈ ఏడాది పాఠశాలకు సంబంధించిన ఖర్చులు,లెక్కలు, కూడికలూ, తీసివేతలు లాంటి పనులన్నీ వారివే. 

ఇవి కాక

      శుభకార్యానికి పసుపు కొట్టడం లాంటి పని వార్షికోత్సవానికి కావలసిన హాల్ వెతికి బుక్ చెయ్యడం. దేవినేని నీలిమ గారు ఆ బాధ్యత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. గతంలో కోశాధికారిగా ఆవిడ ప్రతిభ జగద్విదితమే. తనకో పనిచ్చి మనం మరచిపోయనా మన వెంట పడి మరీ ఇచ్చిన దానిని విజయవంతంగా పూర్తి చేయగలరు. బహుమతుల కొనుగోలు వ్యవహారం కూడా ఆవిడే చూసుకుంటానన్నారు. కల్యాణి పుల్లేటి గారు ఆవిడకు సహాయం చేస్తామన్నారు.

      బానర్ డిజైన్ అనగానే మనం రెండో మాట లేకుండా కొత్త రఘునాథ్ గారు అనేసుకుంటాం. ఒకటేమిటి లెండి ఇక్కడ అక్కడ అనిలేక ఎక్కడ అవసరమైనా ఆయనే ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే పాఠశాలకు సంబంధించి సర్వాంతర్యామి. ఈ సారి ఎరగుడిపాటి శ్రీవాణి గారు ఆ బాధ్యత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. కొత్తగా వచ్చినా ఉపాధ్యాయులందరికీ శ్రీవాణి గారు పరిచయస్తులే. ఆవిడ గురించి చెప్పాలంటే ఇందు గలరు అందు లేరు..ఎందెందు వెతికినా .. అనే పద్యం సరిపోతుంది.

     విద్యార్ధుల కోసం ట్రోఫీలు, సర్టిఫికేట్లు తెప్పించే బాధ్యత వేమూరి సత్య గారు, ఫోటోలు, వీడియోలు తీయడం, తీయించడం లాంటి బాధ్యతలు గూడె మురళి మనోహర్ గారు తీసుకున్నారు. వారివురు ముందుకు రాగానే సమావేశంలో కలకలం. పోయిన ఏడాది వార్షికోత్సవం నాడు వారు చేసిన పని ఇంతా అంతా కాదుట. తెర వెనుక ఎక్కడ చూసినా వాళ్ళేనట. కొండమడుగు శివ గారు, దండ గోవిందరావు గారు మురళి గారికి సహాయం చేస్తామన్నారు.

     సమావేశానికి హాజరుకాలేక పోయినా మేడికాయాల నరసింహ గారు స్పీకర్స్, మ్యూజిక్ సిస్టం గురించి అన్ని వివరాలు తాను చూసుకుంటానని చెప్పి పంపించారు. కొండమడుగు శివగారు వారికి సహాయం చేస్తామన్నారు.

    "ఇతరత్రా ఏ సహాయం కావాలన్నా నేనున్నా" అన్నారు కింతలి అనురాధ గారు. ఆవిడ ఇంకో మాట కూడా అన్నారండోయ్. ఈ సమావేశం జరిగిన తరువాత రోజు ఉదయాన్నే ఫోన్ చేసి "ఏ పార్టీలో కూడా ఇంతలా ఎంజాయ్ చెయ్యలేదు, భలేగా జరిగింది సమావేశం" అని ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.

     హాలు శుభ్రత విషయంలో తను బాధ్యత తీసుకుంటానన్నారు మురళి మోహన్ గారు. తన్నీరు లక్ష్మీ రాజేశ్వరి గారు సమావేశానికి హాజరైన ఇరవై మందికి సరిపడా రుచికరమైన ఫలహారాలు స్వయంగా చేసుకుని తీసుకువచ్చారు. 


    వీరు కాక ఇంకా చాలామంది ఈ సమావేశానికి రాలేకపోతున్నామని ఏ సహాయం చేయడానికైనా సిద్దమేనని మెయిల్, ఫోన్ ద్వారా తెలియజేశారు.

     ఇంతమంది నిస్వార్ధంగా కృషి చేస్తుండబట్టే పాఠశాల వార్షికోత్సవం ప్రతి ఏడాది విజయవంతంగా జరుగుతోంది. 

ఎందరో మహానుభావులు. అందరికీ వందనం

Friday, May 1, 2015

ఆరవ వార్షికోత్సవం

        పాఠశాల మొదలుపెట్టి ఆరు సంవత్సరాలు పూర్తయిందంటే నమ్మశక్యంగా లేదు. తెలుగులో ఒక్క అక్షరం పలకలేని పిల్లలు ఈరోజు మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మొదలు పెట్టినప్పుడు పుస్తకాలు లేవు, ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో తెలీదు. అలాంటిది ఇవాళ మాకై మేము సొంతంగా పాఠ్యాంశాలను రూపొందించుకుని పాఠాలు చెప్పగలగడమే కాక, పాఠాలు చెప్పాలన్న ఉత్సాహంతో ముందుకు వచ్చిన వారికి ప్రణాళిక ఇవ్వగలిగే స్థాయికి వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. 

ఇన్ని సంవత్సరాలు అర్ధరాత్రి, అపరాత్రి అని లేక ఫోన్ చేసినా విసుక్కోక నన్ను భరించి నాతో నడిచిన ఉపాధ్యాయులు, మీరివన్నీ మీ పిల్లలతో చేయించాలంటే ఎందుకు ఏమిటి అని అడక్కుండా తూ. చా. తప్పకుండా పాటించిన తల్లిదండ్రులు, పద్యాలు, పాటలు, ఆటలు, మాటలు అన్నీ నేర్చిన చిన్నారులు, నాలుగు తరగతులు పూర్తి చేసి పాఠశాలను ప్రగతి పథం వైపు నడిపిస్తున్న పట్టభద్రులు అందరూ ఈ విజయంలో భాగస్వాములే. 


ఆరవ వార్షికోత్సవం విశేషాలు ఇక్కడ చూడొచ్చు. . 

Wednesday, April 29, 2015

ఐదవ వార్షికోత్సవం/నేనెరిగిన పంచభూతాలు

"వార్షికోత్సవం ఈ సంవత్సరం......" 
""చేద్దాం చేద్దాం" పిల్లలదీ పెద్దలదీ ఒకటే మాట.
"ఎలాగా? పోయినేడాది లాగానేనా"
"అబ్బే, పోయిన సంవత్సరం మన పాఠశాల వాళ్ళమే చేసుకున్నాం తప్ప వేరే వాళ్ళను పిలవలేక పోయాం. ఈ సంవత్సరం అలా కాదు ఆసక్తి ఉన్న స్నేహితులను కూడా పిలుద్దాం"
"మనమే దగ్గరదగ్గరగా నలభై ఐదు కుంటుంబాలు. క్లబ్ హౌస్ సరిపోదు.మరి ఎక్కడ చేద్దాం? "
"ఏదైనా స్కూల్ తీసుకుందా౦"
స్కూల్ గురించి వేట మొదలైంది. కనుక్కుంటే తెలిసిందేమిటంటే రెంట్ తక్కువే ఉంది కాని ఇన్సురెన్స్ చాలా ఎక్కువ. వెంకట్ గొట్టిపర్తి గారు ఆ సమస్య తీర్చేసి కమ్యూనిటీ హౌస్ మిడిల్ ఇప్పించేశారు. మార్చ్ పదహారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కార్యక్రమం మొదలైయేట్లుగా నిర్ణయమైంది. 

"అందరినీ ఆహ్వానించడానికి మరి ఆహ్వాన పత్రిక.."
"మేం చేస్తాం" ఉత్సాహంగా ముందుకు వచ్చారు మురళి గారు, రామకృష్ణ గారు. చెప్పినట్లుగానే అందమైన ఆహ్వాన పత్రిక తాయారు చేశారు. తమ్మా రావు గారు ఆ పత్రికకు తుది మెరుగులు దిద్దారు. 
ఆ పత్రికను అందరికీ పంపించి పేరు పేరునా ఆహ్వానించారు శేఖర్ గారు.

"ఈ కార్యక్రమానికి వ్యాఖ్యత ఉంటే బావుంటుంది."
"వెంకట్ గారు" టక్కున చెప్పారు కొందరు. 
సమయస్ఫూరితో అలవోకగా చెప్పిన  ఆయన వ్యాఖ్యానం నిన్నటి కార్యక్రమానికి ఓ విశిష్టతను చేకూర్చింది.  

"అతిధులను ఆహ్వానించడానికి ఎమైనా ఏర్పాట్లు చేస్తే బావుంటుంది"
"ఆ పని మేము తీసుకుంటాం. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ మేం చేస్తాం" ముందుకొచ్చారు" రాజశ్రీ, లక్ష్మి.
"మన నాలుగవ తరగతిలో ఉన్నారుగా పెద్ద పిల్లలు వాళ్ళను అక్కడ ఉండమంటే బావుంటుందేమో!"
"అలాగే చేద్దాం"
అనన్య, శివానీ, నేహ సాంప్రదాయ సిద్దంగా అలంకరించుకుని, వచ్చిన వాళ్ళను సాదరంగా ఆహ్వానించారు.

"ఈ కార్యక్రమానికి ఫోటోలు ఎవరు తీస్తారు?"
"ఫణి గారు, రామకృష్ణ గారు ఫోటోలు బాగా తీస్తారు"
వారిద్దరూ అతిధులకు సకుంటుంబ సమేతంగా ఫోటోలు తీసేరు. అలాగే కార్యక్రమంలోని అన్ని విశేషాలను వారి కెమెరాలలో బంధించారు. 
రఘు గారు, వీరా గారు, శ్రీనివాస్ గారు, రాం కుమార్ గారు అన్ని కార్యక్రమాలకు ఓపిగ్గా వీడియో తీశారు.

"మరి వేదిక అలంకరణ, హాల్ అలంకరణ ఏర్పాట్లన్నీ చెయ్యాలిగా..."
"వేదిక కోసం ఇండియా నుండి ఫ్లెక్సీ తెప్పింద్దాం."
"ఇండియానుండంటే తెప్పించడం కష్టమౌతుందేమో!"
"మీకెందుకు నేను తెప్పిస్తాగా" నమ్మకంగా చెప్పారు శైలజ. 
"మరి మిగిలినవన్నీ?"
"మేం చేస్తాం" ఉత్సా౦హంగా ముందుకు వచ్చారు కళ్యాణి, వకుళ, నరసింహ గారు, సనత్ గారు
"ఐదు తరగతులకూ వెళ్ళి ఫోటోలు తీసి అన్నీ ఒక పోస్టర్ లో అంటించి అక్కడ అలకరిద్దాం"
"వేదిక మీద ఫ్లెక్సీ పెట్టాక మిగిలినవి అక్కర్లేదు. ఎలాగూ ఐదు క్లాసుల ఫోటోలు తీస్తున్నాం, పిల్లల పేర్లు రాసి ఆ తరగతులలో చెప్పే పాఠ్యాంశాలు కూడా అందులో జత చేసి పోస్టర్ చేద్దాం. ఏమంటారు?"
"మంచి ఆలోచన"
అనుకున్నట్లుగానే అన్ని తరగతులకూ వెళ్ళి ఫోటోలు తీసి, అవన్నీ రంగు రంగుల పోస్టర్ మీద అందంగా అమర్చి హాల్లో అలంకరిచారు వకుళ, కళ్యాణి.

"పిల్లలందరూ ఇలా కష్టపడి తెలుగు నేర్చుకుంటున్నారు. వాళ్ళకు ట్రోఫీలు ఇస్తే బావుంటుంది."
"పాసయిన వాళ్ళకు సర్టిఫికెట్లు కూడా"
"అలాగే" 
"సర్టిఫికెట్లు నేను చేస్తాను" రఘు చెప్పారు.
"నేను ప్రింట్ చేయిస్తాను" నవీన్ గారు ముందుకొచ్చారు.
"టీచర్లకు కూడా జ్ఞాపిక ఇస్తే బావుంటుంది." టీచర్ల పరోక్షంలో గుసగుసలు.
"ఒక పని చేద్దాం, అన్ని తరగుల ఫోటోలు తీశాం కదా! జ్ఞాపిక అలా ఫోటోతో తయారుచేద్దాం" వెంకట్ గారి సలహా. 
"మంచి ఆలోచన"
"ఈ ట్రోఫీలు, జ్ఞాపికలు తయారుచేసే వాళ్ళు నాకు తెలుసు. అవన్నీ నేను చూసుకుంటాను" వెంకట్ గారు భరోసా ఇచ్చారు. 
తల్లిదండ్రులు, వారి పిల్లల ఉపాధ్యాయులకు జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. ఈ ఏడాది ఉపాధయులకు అవసరమైన సహాయం చేస్తూ వచ్చే ఏడాది నుండి పాఠాలు చెప్పడానికి నిర్ణయించుకున్న ఉష, కవితలు వేదిక మీద పుష్పగుచ్చం అందుకున్నారు. విద్యార్ధులందరూ అందమైన పాఠశాల లోగోతో, వాళ్ళ పేర్లు రాసి వున్న ట్రోఫీలను, సర్టిఫికెట్లను వారి టీచర్ల చేతుల అందుకున్నారు.  


"మీ తరగతులలో తీసిన ఫోటోలు, వీడియోలు ఏమైనా ఉంటే చూడండి" నవీన్ గారు, రఘు తరగతి వీడియో చేసి వేదిక ప్రదర్శించడానికి సంకల్పించారు.
"తరగతిలో ఎప్పుడూ ఫోటోలు తీయలేదు కాని, పిల్లలతో వేయించిన నాటికలు, వారు పాడిన పాటలు, వాళ్ళతో సంక్రాంతికి, వినాయక చవితికి బొమ్మలు చేయించినప్పటి ఫోటోలు కూడా ఉన్నాయి."
"అయితే ఒక పని చేద్దాం అవి కొన్ని పెట్టి, ఈ పిల్లల ఇంటి దగ్గర తీసిన వీడియోలు పంపమని అడుగుదాం" 
ఆ విధంగా వీడియో రూపుదిద్దుకుంది. అచ్చమైన తెలుగులో పిల్లల సంభాషణలు, ఉపాధ్యాయుల కోసం వారు చెప్పిన శ్లోకాలు, పాడిన పాటలు, వినూత్న రీతుల్లో వారు చెప్పిన పద్యాలు. ఇంట్లోనే కాకుండా బయటకు వెళ్ళినప్పుడు వారు చెప్పిన కూరగాయల పేర్లు. ఇలా ఎన్నో ఎన్నెన్నో....ఆ వీడియో నిన్న చూసినప్పుడు పిల్లాల్ని చూసి ముచ్చటేసింది. తల్లిదండ్రులకు తెలుగు నేర్పించడం పట్ల ఉన్న ఉత్సాహం చూసి చాలా సంతోషంగా అనిపించింది. 

"మరి సాయంత్రం అంటున్నాం. భోజనాలో...."
"మీకెందుకు మేమున్నాం" భరోసా ఇచ్చేసారు రజని, ప్రియ, జ్యోతి, రంజని, రామారావ్ గారు, సత్య గారు. వాళ్ళే ప్రణాళిక సిద్దం చేసి, అందరినీ సంప్రదించి అందరూ తలా ఒక ట్రే కూరో, బిర్యానీనో, స్వీటో, పచ్చడో తెచ్చేట్లుగా చూసుకున్నారు. ఏ షాపులు తిరిగారో ఎలా చేసారో కాని కావలసిన వస్తువులన్నీ లోపం రానేయకుండా సమకూర్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఉత్సాహంగా ముందుకు వచ్చిన తల్లిదండులందరి సహకారంతో షడ్రశోపేతమైన విందు భోజనం వేడివేడిగా వడ్డించారు.

"అంతా బాగానే ఉంది. మరి పిల్లల కార్యక్రమాలు ఏం చేద్దాం?"
"ఎవరి తరగతి పిల్లలతో వాళ్ళం చేయిస్తా౦" చెప్పేరు టీచర్లు.
"మీకెటువంటి సహాయం కావాలన్నా మాకు చెప్పండి" అంటూ తల్లిదండ్రులందరూ నిండు మనసులో చెప్పారు. 

ఈ మొత్తం కార్యక్రమ౦లో మా టీచర్లు రాధ, లావణ్య, స్నేహ, సుమతి, మంజుల, శైలజ, రాజశ్రీ, అనురాధ, రఘు చేసిన కృషి మరువలేనిది. నాటికలు వేయించారు. పద్యాలు, శ్లోకాలు చెప్పించారు, పాటలు పాడించారు. స్వాతంత్ర్య సమార యోధులను వేదిక మీదకు తీసుకుని వచ్చి "వీరెవరో చెప్పుకోండి చూద్దాం" అని ప్రేక్షకులకు పరీక్ష పెట్టారు. "ఎవరు నిజమైన అందెగత్తో" చూపించారు. మెంతులు, అవలతో మాట్లాడించారు. కలి చేయిస్తున్న అరాచకాల గురించి పిల్లలకు పెద్దలకు అర్ధమయ్యే రీతిలో వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో... 

ఇందులో పెద్దవాళ్ళ పాత్ర కూడా తక్కువేమీ కాదండోయ్. ఐదు, ఆరేళ్ళ పిల్లలతో అసభ్యకరమైన పాటలు పాడి౦చి అదే ఘనకార్యం అన్నట్లు చప్పట్లు కొట్టి మురిసి పోతున్న ఈ రోజుల్లో "అమ్మా కథ చెప్పవే" అంటూ మనసు కదిలించే పాటలు, "అందమైనది భారతమూ, మన భారతమూ" అనే దేశభక్తీ గీతం, చిట్టి చిట్టి మిరియాలు అనే చిన్నచిన్న పాటలు నేర్పించి కార్యక్రమానికి వన్నె తెచ్చారు. 

ప్రతి తరగతికీ ఆ తరగతిలోని పిల్లలే వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం మరో విశేషం. వచ్చీరాని తెలుగులో ఏదో చెప్పుంటారు అనుకుంటున్నారేమో, కాదండీ. స్పష్టమైన తెలుగులో చక్కగా మాట్లాడారు. 

"పెద్దవాళ్ళకు కూడా ఏమైనా కార్యక్రమం ఉంటే బావుంటుంది."  
"తప్పకుండా చేద్దాం"
"ఏమైనా క్విజ్ పెడదామా?"   
లావణ్య, సనత్ గారు, శైలజ కలసి సాహిత్యం, వినోదం, చరిత్ర ఇలా కొన్నింటి మీద రకరకాల ప్రశ్నలు వేసి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. 

"పాఠశాల ఐదవ వార్షికోత్సవం చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి."
"మీరంతగా చెప్పాలా, తప్పకుండా వస్తాం. పాఠశాల గురించి తెలుసుకోవాలని మాకూ ఆసక్తిగా ఉంది"
మేము పిలిచినా ప్రతివారూ ఇదే సమాధానం. ముఖస్తుతి మాటలు కదండీ. ఇచ్చిన మాట ప్రకారం వారి అమూల్య సమయాన్ని వెచ్చించి, ఆద్యంతం ఈ చిన్నారుల కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించి, దీవెనలు అందిచారు. 

ఎన్నో అనుకుంటాం. ఏవేవో కలలు కంటాం. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ పంచభూతాలు మనకు అండగా నిలుస్తాయిని ఎక్కడో చదివాను. ఆ పంచభూతాల సంగతేమొ తెలియదు కాని, ఈ ప్రయత్నానికి అంటే ఈ కార్యక్రమానికి మాత్రమే కాదు, భాషాభివృద్ది కోసం కూడా పాటుపడుతున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తిగా నేర్చుకుంటున్న విద్యార్ధులు, వాళ్ళను ప్రోత్సహించడానికి విచ్చేసిన అతిధులు అందరూ ఆ పంచభూతాలకంటే కూడా ఉన్నతంగా కనిపిస్తున్నారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 

సమస్య ఉంటుంది. సమస్యను గురించి పదిరకాలగా  చెర్చలు చేస్తూ సమయం వృధా చేయకుండా పరిష్కారం అలోచించి, ఆ వైపుగా పయనించిస్తే ఎన్నో ఆణిముత్యాలు దొరుకుతాయి. ఆ ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు వెలకట్టలేనివి. ఎప్పుడైతే నేను, నాది అనే చట్రంలో పడతామో అన్నీ కోల్పోతాం. ఆఖరికి మనకి మనమే ఏమీ కాకుండా అయిపోతాం.  

ఊహించని రీతిలో ఈ కార్యక్రమాన్ని జరిపించిన ఇంతమంది సహృదయుల మధ్య ఉండడం ఎన్ని జన్మల సుకృతమో!

5వ వార్షికోత్సవం వీడియోలు 


యాంకర్ వెంకట్ గారి మాటల్లో ఉపాధ్యాయులు రఘు, జ్యోతిర్మయి, మంజుల, రాజశ్రీ, రాధ, అనురాధ, స్నేహ, సుమతి, లావణ్య, శైలజ  ఏమంటున్నారంటే 

Monday, February 3, 2014

వార్షికోత్సవం 2013


ఎస్ నో ఆల్రైట్ http://www.youtube.com/watch?v=vpNdp67q7w4
మూడు చేపల కథ http://www.youtube.com/watch?v=u-Ec4feFO7I
శరీర అవయవాలు http://www.youtube.com/watch?v=RrCFpstB5v0
వంకాయల పెళ్లి కుదిరింది http://www.youtube.com/watch?v=UjnxYwb2S9s
రూట్స్ http://www.youtube.com/watch?v=-waXd__PEVc


ఒకటవ తరగతి 


రెండవ తరగతి
మూడుచేపల కథ  

మూడవ తరగతి తరగతి 

లింగాష్టకం 

శరీరవయాలు  రెండవ తరగతి పిల్లలు వేసిన నాటిక 


Thursday, January 23, 2014

అక్షరనీరాజనం

పోయిన సంవత్సరం జరిగిన పాఠశాల వార్షికోత్సవం విశేషాలు.



పిల్లలు వేసిన నాటికలు 

ఒకటవ తరగతి: చెడు సావాసాలతో ఎలా కష్టాల పాలౌతమో తెలిపే 'చెడు స్నేహం, వంకాయ పెళ్ళి కుదిరింది, ఇంకా ఐకమత్యం గురించి ప్రభోదించే 'శరీర ఆవయవాలు 'ఏమంటున్నాయో విందామా!

రెండొవ తరగతి:  సమయస్ఫూర్తితో సమస్య ఎలా గట్టెక్కాలి అని సందేశాత్మకమైన "చేపల తెలివి".

మూడవ తరగతి: అర్ధం చేసుకోకుండా బట్టీ పెట్టడం వలన కలిగే అనర్ధాలను తెలిపే "ఎస్ నో ఆల్రైట్", మరియు ఒక మనిషి వ్యక్తిత్వం ఆ మనషి ప్రవర్తన ద్వారా ఎలా బయటపడుతుందో తెలిపే "అప్పు"

నాలుగవ తరగతి పిల్లలు: మాతృదేశానికి ఎంత దూరంలో ఉన్నా మన మూలాలు మర్చిపోకూడనే అంశంతో రూపొందించిన 'రూట్స్' అనే తెలుగు నాటికలు వేశారు. పిల్లలకు ఇంత చక్కని తర్ఫీదు నిచ్చిన ఉపద్యాయులకు ప్రత్యేక అభినందనలు.

మూడు చేపల కథ
శరీర ఆవయవాలు ఏమంటున్నాయో విందామా
     పిల్లలు పెద్ద పెద్ద వాక్యాలు అవలీలగా చెప్తుంటే, "ఇదంతా ఎలా సాధ్యమైంది?" అని ఆశ్చర్యం వేసింది. చాలా సంతోషంగా కూడా అనిపించింది. దీని వెనుక ఉపాద్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల శ్రమ ఎంతుందో అర్ధమైంది. పిల్లలు పాటలు, పద్యాలు కూడా చాలా చక్కగా చెప్పారు.
'లింగాష్టకం' పాడుతున్న నాలుగవ తరగతి పిల్లలు
          ఈ పిల్లలను "మీకు తెలుగు చదవడం వచ్చింది కదా..ఇక ఇంటి దగ్గర  చదువుకోండి" అని చెప్తే, "లేదు మేము పాఠశాలకే వస్తామంటూ" ఈ ఏడాది కూడా వచ్చి స్పష్టంగా చదవడం నేర్చుకుంటున్నారు. వీళ్ళకోసం నాలుగవ తరగతి మొదలు పెట్టాము. ఒక్కరోజు వాళ్ళ ఉపాద్యాయుడు రాకపోతే ఈ పిల్లలు మొహాలు చిన్నబోవడం చూస్తుంటే వారి అనుబంధానికి చాలా ముచ్చటేస్తుంది. వీరు పాడిన లింగాష్టకం ఇక్కడ చూడొచ్చు.


ఒకటవ తరగతి ఉపాద్యాయని మంజుల 
ఒకటవ తరగతి ఉపాద్యాయులు సుమతి, స్నేహ
రెండవ తరగతి ఉపద్యాయని లావణ్య
రెండవ తరగతి ఉపాద్యాయులు రాధ, లక్ష్మి 
మూడవ తరగతి ఉపాద్యాయని రాధ 
నాలుగవ తరగతి ఉపాద్యాయులు రఘునాథ్ 
పాఠశాల ఉపాధ్యాయుల బృందం 
   ఈ ఉపాద్యాయులందరూ స్వలాభాపేక్షలేకుండా ఏడాది పొడవునా అంకితభావంతో పాఠాలు చెప్తున్నారు. 
      
     పిల్లలే ముందుకు వచ్చి తెలుగు ఎందుకు నేర్చుకోవాలో, వాళ్ళకు తెలుగు నేర్చుకోవడం ఎంత ఇష్టంగా వుందో చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. బోధనలో భాగంగా ప్రతి వారం తరగతిలో చెప్పే 'మంచి విషయం', పిల్లల ప్రవర్తనలో ఎలా మార్పు తీసుకొని వస్తుందో చెప్తూ నేటి విద్యా విధానంలో లోపించిన ఎన్నో అంశాలు వారు ఈ తరగతులలో నేర్చుకుంటున్నారని...ఆ తల్లిదండ్రుల మాటల్లో వింటుంటే మా బాధ్యత మరింత స్పష్టంగా అర్ధం అయింది. 

     తల్లిదండ్రులు, ఉపద్యాయులకోసం ప్రత్యేకంగా రూపొందించిన 'తెలుగు భాష గొప్పదనం' పాట, ఆ తరువాత తెలుగులో వారు కవిత వ్రాసి ఇచ్చిన మేమెంటో మాకు ఎంతో విలువైనవి.  
   
      'ఒక్క నిముషం తెలుగు', 'మన తెలుగు తెలుసుకుందాం', 'మీకు తెలుసా...' వంటి కార్యక్రమాల పాల్గొన్న పెద్దవాళ్ళ ఉత్సాహం చూసాక మన భాష పట్ల వున్న మమకారం అర్ధం అయింది.

      ఇన్నాళ్ళూ పిల్లలు ఏమి నేర్చుకున్నా, అందరి ముందు ప్రదర్శించడం ఇదే మొదటిసారి. పిల్లలు చేసిన అక్షర నీరాజనానికి పెద్దల కళ్ళలో  ఆనందభాష్పాలు నిలిచాయి. పెద్దలందరూ వారిని మెచ్చుకున్నందుకు పిల్లలకు చాలా గర్వంగా కూడా అనిపించే ఉంటుంది. ఆ స్ఫూర్తితో వారు మరింత శ్రద్దగా తెలుగు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. 

పాఠశాల గుర్తింపు చిహ్నంలో వున్న మూడు అంశాలు 

భాష: మాతృభాషను నేర్పించడం
భావం: మంచి భావాలను పెంపొందించేలా పాఠ్యప్రణాళిక రూపొందించడం.
భవిత: భవితను సన్మార్గం వైపు నడిపించడం.

తెలుగు నేర్పించాలనుకుంటున్న పెద్దల కోసం ఓ నాలుగు మాటలు
  • తెలుగు నేర్పించాలన్న మీ సంకల్పం అభినందనీయం.
    • మన భాష నేర్చుకుంటున్నామన్న ఉత్సాహ౦ పిల్లలకు కలుగజేయాలి.
    • పద్యాలు, శ్లోకాలు చెప్పించడం వలన వారికి తెలుగు మాట్లాడం తేలిక అవుతుంది.
    • సామెతలు, జాతీయాల వంటివి వాడడం ద్వారా వారిలో, ఆసక్తిని కలిగించి వారికి భాషనే కాక లోకజ్ఞానాన్ని కలిగించిన వాళ్ళమౌతాము.
    • చక్కని భావం వున్న పాటలను వినిపించడం, స్పష్టమైన ఉచ్చారణ ఉన్న టివి కార్యక్రమాలను చూపించడం వలన వారికెన్నో కొత్త పదాలు పరిచయమౌతాయి.
    • ఇంట్లో తెలుగులోనే మాట్లాడేలా ప్రోత్సహించండి.
    • తెలుగులో మాట్లాడినప్పుడు వారికి చిన్న, చిన్న బహుమతులు ఇస్తే  ప్రోత్సాహకరంగా ఉంటుంది.
    • రాత్రి పడుకునేప్పుడు తెలుగు కథ చదవడం, లేదా తెలుగులో కథ చెప్పడం వల్ల వాళ్ళకు భాషతో అనుబంధం ఏర్పడుతుంది.
    • పండుగ రోజు ఆ పండుగ యొక్క ప్రాశస్త్యం, కథ చెప్పడం వలన వారికి మన సంస్కృతి గురించి చక్కని అవగాహన వస్తుంది.
    • మీరు తెలుగులో మాట్లాడేప్పుడు ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడకండి.
    • అన్నింటికంటే ముఖ్యమైనది మీరు మీ పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి.
    • ఎవరైనా వారితో ఇంగ్లీషులో మాట్లాడుతున్నా పిల్లలకు తెలుగు అర్ధమౌతుందనే విషయాన్ని గుర్తుచేయడానికి మొహమటపడకండి.
          
           భవితను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిది.