Wednesday, April 29, 2015

ఐదవ వార్షికోత్సవం/నేనెరిగిన పంచభూతాలు

"వార్షికోత్సవం ఈ సంవత్సరం......" 
""చేద్దాం చేద్దాం" పిల్లలదీ పెద్దలదీ ఒకటే మాట.
"ఎలాగా? పోయినేడాది లాగానేనా"
"అబ్బే, పోయిన సంవత్సరం మన పాఠశాల వాళ్ళమే చేసుకున్నాం తప్ప వేరే వాళ్ళను పిలవలేక పోయాం. ఈ సంవత్సరం అలా కాదు ఆసక్తి ఉన్న స్నేహితులను కూడా పిలుద్దాం"
"మనమే దగ్గరదగ్గరగా నలభై ఐదు కుంటుంబాలు. క్లబ్ హౌస్ సరిపోదు.మరి ఎక్కడ చేద్దాం? "
"ఏదైనా స్కూల్ తీసుకుందా౦"
స్కూల్ గురించి వేట మొదలైంది. కనుక్కుంటే తెలిసిందేమిటంటే రెంట్ తక్కువే ఉంది కాని ఇన్సురెన్స్ చాలా ఎక్కువ. వెంకట్ గొట్టిపర్తి గారు ఆ సమస్య తీర్చేసి కమ్యూనిటీ హౌస్ మిడిల్ ఇప్పించేశారు. మార్చ్ పదహారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కార్యక్రమం మొదలైయేట్లుగా నిర్ణయమైంది. 

"అందరినీ ఆహ్వానించడానికి మరి ఆహ్వాన పత్రిక.."
"మేం చేస్తాం" ఉత్సాహంగా ముందుకు వచ్చారు మురళి గారు, రామకృష్ణ గారు. చెప్పినట్లుగానే అందమైన ఆహ్వాన పత్రిక తాయారు చేశారు. తమ్మా రావు గారు ఆ పత్రికకు తుది మెరుగులు దిద్దారు. 
ఆ పత్రికను అందరికీ పంపించి పేరు పేరునా ఆహ్వానించారు శేఖర్ గారు.

"ఈ కార్యక్రమానికి వ్యాఖ్యత ఉంటే బావుంటుంది."
"వెంకట్ గారు" టక్కున చెప్పారు కొందరు. 
సమయస్ఫూరితో అలవోకగా చెప్పిన  ఆయన వ్యాఖ్యానం నిన్నటి కార్యక్రమానికి ఓ విశిష్టతను చేకూర్చింది.  

"అతిధులను ఆహ్వానించడానికి ఎమైనా ఏర్పాట్లు చేస్తే బావుంటుంది"
"ఆ పని మేము తీసుకుంటాం. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ మేం చేస్తాం" ముందుకొచ్చారు" రాజశ్రీ, లక్ష్మి.
"మన నాలుగవ తరగతిలో ఉన్నారుగా పెద్ద పిల్లలు వాళ్ళను అక్కడ ఉండమంటే బావుంటుందేమో!"
"అలాగే చేద్దాం"
అనన్య, శివానీ, నేహ సాంప్రదాయ సిద్దంగా అలంకరించుకుని, వచ్చిన వాళ్ళను సాదరంగా ఆహ్వానించారు.

"ఈ కార్యక్రమానికి ఫోటోలు ఎవరు తీస్తారు?"
"ఫణి గారు, రామకృష్ణ గారు ఫోటోలు బాగా తీస్తారు"
వారిద్దరూ అతిధులకు సకుంటుంబ సమేతంగా ఫోటోలు తీసేరు. అలాగే కార్యక్రమంలోని అన్ని విశేషాలను వారి కెమెరాలలో బంధించారు. 
రఘు గారు, వీరా గారు, శ్రీనివాస్ గారు, రాం కుమార్ గారు అన్ని కార్యక్రమాలకు ఓపిగ్గా వీడియో తీశారు.

"మరి వేదిక అలంకరణ, హాల్ అలంకరణ ఏర్పాట్లన్నీ చెయ్యాలిగా..."
"వేదిక కోసం ఇండియా నుండి ఫ్లెక్సీ తెప్పింద్దాం."
"ఇండియానుండంటే తెప్పించడం కష్టమౌతుందేమో!"
"మీకెందుకు నేను తెప్పిస్తాగా" నమ్మకంగా చెప్పారు శైలజ. 
"మరి మిగిలినవన్నీ?"
"మేం చేస్తాం" ఉత్సా౦హంగా ముందుకు వచ్చారు కళ్యాణి, వకుళ, నరసింహ గారు, సనత్ గారు
"ఐదు తరగతులకూ వెళ్ళి ఫోటోలు తీసి అన్నీ ఒక పోస్టర్ లో అంటించి అక్కడ అలకరిద్దాం"
"వేదిక మీద ఫ్లెక్సీ పెట్టాక మిగిలినవి అక్కర్లేదు. ఎలాగూ ఐదు క్లాసుల ఫోటోలు తీస్తున్నాం, పిల్లల పేర్లు రాసి ఆ తరగతులలో చెప్పే పాఠ్యాంశాలు కూడా అందులో జత చేసి పోస్టర్ చేద్దాం. ఏమంటారు?"
"మంచి ఆలోచన"
అనుకున్నట్లుగానే అన్ని తరగతులకూ వెళ్ళి ఫోటోలు తీసి, అవన్నీ రంగు రంగుల పోస్టర్ మీద అందంగా అమర్చి హాల్లో అలంకరిచారు వకుళ, కళ్యాణి.

"పిల్లలందరూ ఇలా కష్టపడి తెలుగు నేర్చుకుంటున్నారు. వాళ్ళకు ట్రోఫీలు ఇస్తే బావుంటుంది."
"పాసయిన వాళ్ళకు సర్టిఫికెట్లు కూడా"
"అలాగే" 
"సర్టిఫికెట్లు నేను చేస్తాను" రఘు చెప్పారు.
"నేను ప్రింట్ చేయిస్తాను" నవీన్ గారు ముందుకొచ్చారు.
"టీచర్లకు కూడా జ్ఞాపిక ఇస్తే బావుంటుంది." టీచర్ల పరోక్షంలో గుసగుసలు.
"ఒక పని చేద్దాం, అన్ని తరగుల ఫోటోలు తీశాం కదా! జ్ఞాపిక అలా ఫోటోతో తయారుచేద్దాం" వెంకట్ గారి సలహా. 
"మంచి ఆలోచన"
"ఈ ట్రోఫీలు, జ్ఞాపికలు తయారుచేసే వాళ్ళు నాకు తెలుసు. అవన్నీ నేను చూసుకుంటాను" వెంకట్ గారు భరోసా ఇచ్చారు. 
తల్లిదండ్రులు, వారి పిల్లల ఉపాధ్యాయులకు జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. ఈ ఏడాది ఉపాధయులకు అవసరమైన సహాయం చేస్తూ వచ్చే ఏడాది నుండి పాఠాలు చెప్పడానికి నిర్ణయించుకున్న ఉష, కవితలు వేదిక మీద పుష్పగుచ్చం అందుకున్నారు. విద్యార్ధులందరూ అందమైన పాఠశాల లోగోతో, వాళ్ళ పేర్లు రాసి వున్న ట్రోఫీలను, సర్టిఫికెట్లను వారి టీచర్ల చేతుల అందుకున్నారు.  


"మీ తరగతులలో తీసిన ఫోటోలు, వీడియోలు ఏమైనా ఉంటే చూడండి" నవీన్ గారు, రఘు తరగతి వీడియో చేసి వేదిక ప్రదర్శించడానికి సంకల్పించారు.
"తరగతిలో ఎప్పుడూ ఫోటోలు తీయలేదు కాని, పిల్లలతో వేయించిన నాటికలు, వారు పాడిన పాటలు, వాళ్ళతో సంక్రాంతికి, వినాయక చవితికి బొమ్మలు చేయించినప్పటి ఫోటోలు కూడా ఉన్నాయి."
"అయితే ఒక పని చేద్దాం అవి కొన్ని పెట్టి, ఈ పిల్లల ఇంటి దగ్గర తీసిన వీడియోలు పంపమని అడుగుదాం" 
ఆ విధంగా వీడియో రూపుదిద్దుకుంది. అచ్చమైన తెలుగులో పిల్లల సంభాషణలు, ఉపాధ్యాయుల కోసం వారు చెప్పిన శ్లోకాలు, పాడిన పాటలు, వినూత్న రీతుల్లో వారు చెప్పిన పద్యాలు. ఇంట్లోనే కాకుండా బయటకు వెళ్ళినప్పుడు వారు చెప్పిన కూరగాయల పేర్లు. ఇలా ఎన్నో ఎన్నెన్నో....ఆ వీడియో నిన్న చూసినప్పుడు పిల్లాల్ని చూసి ముచ్చటేసింది. తల్లిదండ్రులకు తెలుగు నేర్పించడం పట్ల ఉన్న ఉత్సాహం చూసి చాలా సంతోషంగా అనిపించింది. 

"మరి సాయంత్రం అంటున్నాం. భోజనాలో...."
"మీకెందుకు మేమున్నాం" భరోసా ఇచ్చేసారు రజని, ప్రియ, జ్యోతి, రంజని, రామారావ్ గారు, సత్య గారు. వాళ్ళే ప్రణాళిక సిద్దం చేసి, అందరినీ సంప్రదించి అందరూ తలా ఒక ట్రే కూరో, బిర్యానీనో, స్వీటో, పచ్చడో తెచ్చేట్లుగా చూసుకున్నారు. ఏ షాపులు తిరిగారో ఎలా చేసారో కాని కావలసిన వస్తువులన్నీ లోపం రానేయకుండా సమకూర్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఉత్సాహంగా ముందుకు వచ్చిన తల్లిదండులందరి సహకారంతో షడ్రశోపేతమైన విందు భోజనం వేడివేడిగా వడ్డించారు.

"అంతా బాగానే ఉంది. మరి పిల్లల కార్యక్రమాలు ఏం చేద్దాం?"
"ఎవరి తరగతి పిల్లలతో వాళ్ళం చేయిస్తా౦" చెప్పేరు టీచర్లు.
"మీకెటువంటి సహాయం కావాలన్నా మాకు చెప్పండి" అంటూ తల్లిదండ్రులందరూ నిండు మనసులో చెప్పారు. 

ఈ మొత్తం కార్యక్రమ౦లో మా టీచర్లు రాధ, లావణ్య, స్నేహ, సుమతి, మంజుల, శైలజ, రాజశ్రీ, అనురాధ, రఘు చేసిన కృషి మరువలేనిది. నాటికలు వేయించారు. పద్యాలు, శ్లోకాలు చెప్పించారు, పాటలు పాడించారు. స్వాతంత్ర్య సమార యోధులను వేదిక మీదకు తీసుకుని వచ్చి "వీరెవరో చెప్పుకోండి చూద్దాం" అని ప్రేక్షకులకు పరీక్ష పెట్టారు. "ఎవరు నిజమైన అందెగత్తో" చూపించారు. మెంతులు, అవలతో మాట్లాడించారు. కలి చేయిస్తున్న అరాచకాల గురించి పిల్లలకు పెద్దలకు అర్ధమయ్యే రీతిలో వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో... 

ఇందులో పెద్దవాళ్ళ పాత్ర కూడా తక్కువేమీ కాదండోయ్. ఐదు, ఆరేళ్ళ పిల్లలతో అసభ్యకరమైన పాటలు పాడి౦చి అదే ఘనకార్యం అన్నట్లు చప్పట్లు కొట్టి మురిసి పోతున్న ఈ రోజుల్లో "అమ్మా కథ చెప్పవే" అంటూ మనసు కదిలించే పాటలు, "అందమైనది భారతమూ, మన భారతమూ" అనే దేశభక్తీ గీతం, చిట్టి చిట్టి మిరియాలు అనే చిన్నచిన్న పాటలు నేర్పించి కార్యక్రమానికి వన్నె తెచ్చారు. 

ప్రతి తరగతికీ ఆ తరగతిలోని పిల్లలే వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం మరో విశేషం. వచ్చీరాని తెలుగులో ఏదో చెప్పుంటారు అనుకుంటున్నారేమో, కాదండీ. స్పష్టమైన తెలుగులో చక్కగా మాట్లాడారు. 

"పెద్దవాళ్ళకు కూడా ఏమైనా కార్యక్రమం ఉంటే బావుంటుంది."  
"తప్పకుండా చేద్దాం"
"ఏమైనా క్విజ్ పెడదామా?"   
లావణ్య, సనత్ గారు, శైలజ కలసి సాహిత్యం, వినోదం, చరిత్ర ఇలా కొన్నింటి మీద రకరకాల ప్రశ్నలు వేసి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. 

"పాఠశాల ఐదవ వార్షికోత్సవం చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి."
"మీరంతగా చెప్పాలా, తప్పకుండా వస్తాం. పాఠశాల గురించి తెలుసుకోవాలని మాకూ ఆసక్తిగా ఉంది"
మేము పిలిచినా ప్రతివారూ ఇదే సమాధానం. ముఖస్తుతి మాటలు కదండీ. ఇచ్చిన మాట ప్రకారం వారి అమూల్య సమయాన్ని వెచ్చించి, ఆద్యంతం ఈ చిన్నారుల కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించి, దీవెనలు అందిచారు. 

ఎన్నో అనుకుంటాం. ఏవేవో కలలు కంటాం. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ పంచభూతాలు మనకు అండగా నిలుస్తాయిని ఎక్కడో చదివాను. ఆ పంచభూతాల సంగతేమొ తెలియదు కాని, ఈ ప్రయత్నానికి అంటే ఈ కార్యక్రమానికి మాత్రమే కాదు, భాషాభివృద్ది కోసం కూడా పాటుపడుతున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తిగా నేర్చుకుంటున్న విద్యార్ధులు, వాళ్ళను ప్రోత్సహించడానికి విచ్చేసిన అతిధులు అందరూ ఆ పంచభూతాలకంటే కూడా ఉన్నతంగా కనిపిస్తున్నారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 

సమస్య ఉంటుంది. సమస్యను గురించి పదిరకాలగా  చెర్చలు చేస్తూ సమయం వృధా చేయకుండా పరిష్కారం అలోచించి, ఆ వైపుగా పయనించిస్తే ఎన్నో ఆణిముత్యాలు దొరుకుతాయి. ఆ ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు వెలకట్టలేనివి. ఎప్పుడైతే నేను, నాది అనే చట్రంలో పడతామో అన్నీ కోల్పోతాం. ఆఖరికి మనకి మనమే ఏమీ కాకుండా అయిపోతాం.  

ఊహించని రీతిలో ఈ కార్యక్రమాన్ని జరిపించిన ఇంతమంది సహృదయుల మధ్య ఉండడం ఎన్ని జన్మల సుకృతమో!

5వ వార్షికోత్సవం వీడియోలు 


యాంకర్ వెంకట్ గారి మాటల్లో ఉపాధ్యాయులు రఘు, జ్యోతిర్మయి, మంజుల, రాజశ్రీ, రాధ, అనురాధ, స్నేహ, సుమతి, లావణ్య, శైలజ  ఏమంటున్నారంటే 

6 comments:

 1. ఎవ్వరిని మర్చిపోకుండా అందరికి పేరు, పేరున ధన్య వాదాలు చెబుతూ మీరు కథ లాగ రాసిన తీరు చాలా చాలా బావుంది .

  ReplyDelete
 2. very nice...congratulations jylthi

  ReplyDelete
 3. Wonderful event Jyothi and Raghu garu. Venkat and me are glad to be part of this family event.

  ReplyDelete
 4. అమెరికా లో తెలుగును వెలిగిస్తున్నారు.కథనం బాగుంది

  ReplyDelete
 5. జ్యోతి
  ఆశ్చర్యం ఆనందం
  ఒక అద్భుతం చూస్తున్నట్టుగా ఉంది
  ఎక్కడ తెలుగు వారు, తెలుగు వెలుగుల కోసం ఎంతగా కృషి చేస్తున్నారు
  ఇక్కడ తెలుగుకు తిలోదకాలు ఇస్తున్న వేళ
  అక్కడ ఎంత గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
  తెలుగు నేలపైన ఉన్న వారు దీనిని చూచి విని నిజంగా సిగ్గు పడాల్సిన విషయం
  మీ సమిష్టి కృషికి అభినందనం

  ReplyDelete