Friday, November 22, 2013

వ్యక్తిత్వం

ప్రచురణ - కొత్తపల్లి - జూన్ 2013
రచన: రాధ మండువ 
అభ్యాసము: అనురాధ కింతలి


రాజుకి ఆరేళ్ళ వయసున్నప్పుడు వాళ్ళ నాన్న శ్రీనివాస్‌కి అమెరికాలో ఉద్యోగం దొరికింది. దాంతో వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు.

రాజు పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఎప్పుడూ పుస్తకాలు చదువుకుంటూ ఇంట్లోనే ఉండేవాడు. ఇంటి ఎదురుగా ఉన్న పార్కులో పిల్లలు ఆడుకోవటాన్ని కిటికీలో నుండి చూస్తూ ఉండేవాడు, కానీ వెళ్ళి వాళ్ళతో ఆడుకునేవాడు కాదు. 

వాళ్ళ అమ్మ పద్మ వాడిని ఆటలకు తీసుకెళ్ళినా, వాడు అమ్మ దగ్గరే కూర్చుని ఆటలు చూస్తూ ఉండేవాడు. స్కూల్ పిల్లలతో కూడా పెద్దగా కలిసేవాడు కాదు. అందువల్ల 'వాడికి పుస్తకాలు చదువుకోవడంలోనే ఆనందం ఉందిలే-' అనుకునేది పద్మ .

రాజుకి పన్నెండు సంవత్సరాలు వయసున్నప్పుడు, వాళ్ళంతా ఇండియాకి తిరిగి వచ్చేశారు. రాజు ఇక్కడి స్కూల్లో చేరనైతే చేరాడుగానీ, ఇక్కడ కూడా తోటి పిల్లలతో పెద్దగా కలిసేవాడు కాదు. అయితే ఇప్పుడు వాళ్ల ఇంటికి చాలా మంది బంధువులు, వాళ్ళ పిల్లలు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. దగ్గరి బంధువుల పిల్లలు సెలవల్లో ఒంటరిగా వచ్చి, నాలుగైదు రోజులు ఉండి వెళ్తూండేవాళ్ళు. రాజుని కూడా వాళ్ళ ఇళ్ళకి పంపమని అడిగేవారు. 'రాజు ఎవరింట్లోనూ ఉండలేడు' అని అనుకుని, పద్మ వాడిని ఎవరింటికీ వెళ్లనిచ్చేది కాదు.

శ్రీనివాస్ ఎన్నోసార్లు రాజుని ఒంటరిగా తన అన్నయ్య ఇంటికి పంపాలని ప్రయత్నించాడు. కాని ఎప్పుడూ 'రాజు మనస్తత్వం తనకే తెలుసు' అన్నట్లుగా మాట్లాడేది పద్మ. వాడిని ఎక్కడికీ పంపేది కాదు.

చూస్తూండగానే రాజు తొమ్మిదవ తరగతి పూర్తి చేశాడు. అంతవరకూ వాడు ఒంటరిగా ఎక్కడికీ ప్రయాణం చేయడం కానీ, ఎవరి ఇంట్లోనూ ఉండటం కాని జరగలేదు. ఆ వేసవి సెలవల్లో శ్రీనివాస్ వాళ్ళ అన్న కొడుకు చందు వచ్చాడు, వాళ్ళింటికి.

"పిన్నీ! ఎప్పుడూ నేనే మీ ఇంటికి వస్తున్నాను. రాజుని మా ఇంటికి పంపమని ఎన్ని సార్లు అడిగినా మీరు పంపట్లేదు. ఎందుకు? మేం రాజుని సరిగా చూసుకోమని మీకు అనుమానమా?" అని అడిగాడు వాడు పద్మని.
"ఛ! అదేం కాదురా చందూ! మమ్మల్ని వదిలిపెట్టి ఒంటరిగా ఎవరింటికైనా వెళ్ళటం అంటే రాజుకి ఇష్టం ఉండదు. వాడు ఇబ్బంది పడతాడు. అందుకనే, నేను వాడిని ఎక్కడికీ పొమ్మని బలవంతం చేయనిది " అంది పద్మ.

"అవునా రాజూ! ఎందుకురా, నీకు ఇబ్బంది? మన కజిన్ పెళ్ళి ఈ నెల 25న కదా! మనిద్దరం వారం ముందే వెళదాం. అక్కడ నీకు ఎంతో సరదాగా ఉంటుంది. నేను ఉంటానుగా, నీ వెంట! వెళదామా?" అన్నాడు వాడు, ప్రక్కనే ఉన్న రాజుతో.
"వెళతావా రాజూ?" అని అడిగాడు శ్రీనివాస్.
'వెళ్ళను' అని అంటాడని ఎదురు చూస్తున్న పద్మకి ఆశ్చర్యం వేసేట్లు, 'వెళతాను నాన్నా!' అనేశాడు రాజు. ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది పద్మ.

పెళ్ళిలో అత్తలు, మామయ్యలు, పిన్నులు, బాబాయిలు, వాళ్ళ పిల్లలు అందరూ రాజుని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. వాడు కూడా ఆ వారం రోజులూ అక్కడ ఎంతో సరదాగా గడిపాడు. పెళ్ళి సమయానికి అక్కడికి చేరుకున్న పద్మకూడా అక్కడ రాజు అందరితో చనువుగా, సంతోషంగా మెసలడం చూసి సంతోషపడింది. కొడుకు వైపుకు ఆనందంగా చూసింది.

"చూశావా! నేను చెప్తుంటే విన్నావు కాదు. 'వాడికి ఇష్టం ఉండదు ' అని అనుకున్నావే గాని, 'పిల్లలు పెద్దయ్యే కొద్దీ మారతారు' అని గ్రహించలేకపోయావు " అన్నాడు శ్రీనివాస్ పద్మతో.


'మంచి వ్యక్తిత్వాలు ఏర్పడాలంటే స్వేచ్ఛగా నలుగురితో కలిసి మెలిసి తిరగాలని నాకూ తెలుసు. అయితే, తెలిసి కూడా 'ఏమవుతుందో' అన్న భయంకొద్దీ వాడిని నేను ఎదగనివ్వలేదేమో! ఇప్పటికైనా తెలుసుకున్నాను, మంచిదైంది!' అందరితో మాట్లాడుతూ కలివిడిగా తిరుగుతున్న రాజుని చూస్తూ సంతోషంగా అనుకుంది పద్మ.అభ్యాసము

రాజు అమెరికాకి ఎప్పుడు, ఎందుకు వెళ్ళాడు ?

పద్మ “రాజుకి పుస్తకాలు చదువుకోవడ౦లోనే ఆనందం ఉందని” ఎందుకు అనుకుంది?


రాజుకి ఎంత వయసున్నుప్పుడు వాళ్లoతా ఇండియాకి తిరిగి వచ్చేశారు?

పద్మ రాజుని ఎవ్వరి౦టికీ ఎందుకు పంపేది కాదు?

పద్మ ఎందుకు ఆశ్చర్యoతో చూస్తూ ఉండిపోయింది?

రాజు పెళ్ళిలో వారం రోజులు ఎలా గడిపాడు?

మంచి వ్యక్తిత్వం ఎలా ఏర్పడుతుంది?


క్రింది వాక్యాలు తప్పు, ఒప్పు బ్రాకెట్లలో గుర్తించండి. తప్పుకు (x) గుర్తును,ఒప్పుకు (/-) గుర్తును వ్రాయండి.

రాజు వాళ్ళ నాన్నకి లండన్ లో ఉద్యోగం దొరికింది . ( )

రాజు ఎప్పుడు టివి చూస్తూ ఇంట్లోనే ఉండేవాడు. ( )

రాజుకి పుస్తకాలుచదువు కోవడంలోనే ఆనందం ఉండేది. ( )

శ్రీనివాస ఎన్నోసార్లు రాజుని తన అన్నయ్య ఇంటికి పంపాలని ప్రయత్నించాడు. ( )

రాజు వాళ్ళ కజిన్ పెళ్ళికి వెళ్తాను అని అన్నాడు. ( )

మంచి వ్యక్తిత్వాలు ఏర్పడాలంటే స్వేచ్చగా నలుగురితో కలిసి మెలిసి తిరగాలని పద్మకు తెలియదు . ( )


కింది పదాలు కు అర్ధాలు వ్రాయండి.

వ్యక్తిత్వం
ఉద్యోగం
ఒంటరి 
అనుమానం
స్వేచ్ఛగా
కలివిడి
ఆప్యాయం
మెసలడం

No comments:

Post a Comment