Tuesday, October 22, 2013

దయ

రచన రాధ మండువ
బొమ్మలు: అడవిరాముడు
అభ్యాసము: శైలజ వడకట్టు 

"అమ్మా! నేను రాముని, శీతలని చూసి వస్తా " అంది చిన్ని రామచిలుక. 
"సరే జాగ్రత్తగా వెళ్ళిరా" అంది అమ్మ.

మెల్లగా నడుస్తూ వెళుతున్న చిన్ని రామచిలుకని చూసిన బుజ్జి కుక్కపిల్ల "చిన్నీ! ఆగు - ఆగు. ఎక్కడికి, వెళుతున్నావు" అని అడిగింది తల పైకెత్తి చూస్తూ.
"నేను రాముని, శీతలని చూడటానికి వెళుతున్నాను" అంది చిన్నిచిలుక.

"ఓ! జంతువుల షాపు నుండి నిన్ను కాపాడిన పిల్లలు కదూ! ఎంత మంచి పిల్లలో! వాళ్ళని చూడటానికి నేనూ వస్తాను అంది కుక్కపిల్ల.

"సరే!రా!" అంది చిలుక

ఇద్దరూ వెళుతూ వెళుతూ ఉండగా పిల్లి ఎదురు వచ్చింది. "ఏయ్ బుజ్జీ, చిన్నీ- ఎక్కడికెళుతున్నారు?" అని అడిగింది.

"మేము రాముని, శీతలని చూడటానికి వెళుతున్నాము. నువ్వూ రాకూడదూ మాతో?" అన్నాయి అవి.

"ఎందుకు రాను? వాళ్ళిద్దరూ దయగల పిల్లలు. వాళ్ళని చూడాలని ఎన్నాళ్ళగానో అనుకుంటున్నాను. నీ కథ విన్నప్పటి నుండి నీతో ఎన్నోసార్లు

చెప్పాను కదా, వాళ్ళని చూడాలని ఉందని!" అంది పిల్లి చిలుకని చూస్తూ."అబ్బబ్బ! ఇది వాగుడుపిల్లి. పదపద మాట్లాడకుండా" అంది బుజ్జి కుక్కపిల్ల విసుక్కుంటూ.

ముగ్గురూ వెళుతూ వెళుతూ ఉండగా చెట్టు మీద కూర్చుని పాటలు పాడుకుంటున్న కోకిల వీరిని చూసి పాట ఆపి "ఓ బుజ్జీ, చిన్నీ- ఎక్కడికెళుతున్నారు, ఈ వాగుడు పిల్లిని తీసుకొని?" అంది. దాని మాటలకు పిల్లి మూతి ముడుచుకుంది.

"చిన్నిని కాపాడేరే, ఇద్దరు పిల్లలు- రాము, శీతల! - వాళ్ళని చూడటానికి వెళుతున్నాం!" అంది కుక్కపిల్ల.

"అయితే నేనూ వస్తా !" అంది కోకిల.


నలుగురూ వెళుతూ వెళుతూ ఉండగా ఏమీ తోచక అటూ ఇటూ అనవసరంగా గంతులు వేస్తున్న కోతి వీరిని చూసి వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకు వచ్చి

"ఎక్కడికెళుతున్నారు? నాకేమీ తోచడం లేదు. నేనూ మీతో వస్తా" అంది గబగబా, ఎక్కడికెళుతున్నారో కూడా తెలుసుకోకుండా.

"మేము బావిలో దూకడానికి వెళుతున్నాం అనుకో - వస్తావా? అరే - 'ఎక్కడికెళుతున్నారు - ఏమిటి కథ' అనికూడా అడగకుండా వస్తుం‌దట- వస్తుంది!" అంది పిల్లి, వాగడానికి ఛాన్స్ దొరికింది కదా అని.

"హుష్! ఊరుకో, ఏమిటా మాటలు?!" అంది కోకిల, పిల్లిని పక్కకి లాగుతూ.

"మేము రాముని, శీతలని చూడటానికి వెళుతున్నాము!" అంది చిన్ని చిలుక."ఓ! నిన్ను ఆ మాయదారి అంగడి - జంతువులని అమ్మే అంగడి నుండి కాపాడి, 'అమ్మ దగ్గరకు పో' అని చెప్పిన పిల్లలా? నేను కూడా వస్తా - నేను

కూడా వస్తా!" అంటూ మళ్ళీ గంతులు వేయసాగింది ఉత్సాహంగా.

అవి తిన్నగా, జాగ్రత్తగా రాము, శీతల ఇంటికి వెళ్ళాయి.

వీటిని చూసిన రాము,శీతల వాటికి పండ్లూ, పాలూ పెట్టారు- అవన్నీ తమని చూడటానికి వచ్చాయని తెలియక పోయినా!!!!
అభ్యాసము   

1అర్థాలు

 
దయ =             Compassion
 
వాగుడు =          Blabber
 
రామచిలుక =      Parrot
 
బావి =               Well
జాగ్రత్త =              Caution
కోకిల =               Cuckoo bird.

 2.
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

 
అ. రామచిలుక అమ్మతో ఎవరిని చూడటానికి వెలుతున్నానాన్నది? 
ఆ. ఈ కథలో ఉన్న జంతువుల పేర్లు వ్రాయండి? 
ఇ. కుక్కపిల్ల చిలుకతో రాము, శీతలని 'ఎంత మంచి పిల్లలో' అని ఎందుకు అంది?
ఈ. జంతువులని చుసిన రాము, శీతల వాటికీ ఏమి పెట్టారు?
 
ఉ. ఈ కథ చదివారు కదా, మీరు ఏమి అర్థం చేసుకున్నారో రెండు లేదా మూడు వాక్యాలల్లో వ్రాయండి? 
ఖాళీలు

 
అ. " సరే జాగ్రతగా వెళ్లిరా" అంది .........................

 
ఆ. నేను ....................., ................. చూడటానికి వెళ్తున్నాను.

 
ఇ. వాళ్ళిద్దరూ ...........................గల పిల్లలు.

ఈ. "అబ్బబ్బ! ఇది .......................పిల్లి.


 
ఉ. రాము, శీతల వాటికి ..................., ............. పెట్టారు.

No comments:

Post a Comment