Tuesday, October 22, 2013

ఐకమత్యం

         కథ, అభ్యాసము: శైలజ వాడకట్టు

           అనగనగా రామాపురం అనే గ్రామంలో కన్నయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతని భార్య పేరు యశోద. వారికి ముగ్గురు మగ సంతానం. ఆ ముగ్గురు కొడుకులు చాలా తెలివి గల వాళ్ళు. పట్టణానికి వెళ్లి చౌకగా సరుకుల్ని కొని తేవడంలో మొదటివాడు దిట్ట. రెండోవాడు ఆ సరుకుల్ని చుట్టు పక్కల గ్రామాల్లో తిరిగి ఎక్కువ లాభాలకు అమ్మగల సమర్ధుడు. ఇక మూడవ వాడు లాభనష్టాలు భేరీజు వేస్తూ అన్నలకి సలహాలిచ్చేవాడు. కొడుకుల సహాయంతో కన్నయ్య వ్యాపారం రెండింతలు అయింది.

          కన్నయ్య ముగ్గురు కొడుకులకి వివాహాలు చేసాడు. అందరూ ఒకే ఇంట్లోనే ఉండేవారు. కొంతకాలం హాయిగా గడిచిపోయింది. కొన్ని రోజుల తరువాత ఆ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి." నా వల్లే వ్యాపారం పెద్దదయింది అని ఒకరంటే , కాదు నా సలహాలతోనే ఇంత సంపాదించుకున్న" మంటూ మరొకరు. ఇలా ముగ్గురు కొడుకులూ వాదులాడుకోవడం ప్రారంభించారు . ఈ పరిస్థితి గమనించిన కన్నయ్య ఆస్తిని ముగ్గురికి పంచేసాడు. ముగ్గురూ ఎవరికి వారు సొంత వ్యాపారాలు ప్రారంభించుకున్నారు.

        
పెద్దవాడు సరుకుల్ని తక్కువ ధరకే కొనేవాడు. కానీ గ్రామాల్లో తిరిగి అమ్మే నైపుణ్యం తెలియక ఇబ్బంది పడ్డాడు. రెండోవాడికి పట్టణం వెళ్లి సరుకులు ఎలా కొనాలో తెలియదు. ఇక ఎప్పుడూ సలహాలిస్తూ ఇంటి దగ్గర ఉండే మూడో వాడికి సరుకులు కొనాలన్నా, ఆమ్మాలన్నా కష్టంగానే తోచింది. కొద్ది రోజులకే ముగ్గురి వ్యాపారాలు దివాలా తీశాయి. అప్పుల పాలయ్యారు. సిగ్గుతో తలవంచుకొని తండ్రి దగ్గరకు వచ్చారు. "చూశారా! ఏం జరిగిందో! ముగ్గురూ కలసిమెలసి ఉన్నంతకాలం వ్యాపారం పచ్చగా ఉండేది. విడిపోయి ఎవరికి వారు అనుకునేసరికి అన్నీ నష్టాలే వచ్చాయి."కలసి ఉంటే కలదు సుఖమని" పెద్దలు ఊరికే చెప్పలేదు" అన్నాడు కన్నయ్య.  తప్పు తెలుసుకున్న ముగ్గురు అన్నదమ్ములూ మళ్ళీ ఒకటయ్యారు.  ఐకమత్యంగా ఉంటూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించారు. 

నీతి: ఐకమత్యమే మహాబలము.

వ్యతిరేకపదాలు: 

గ్రామం x పట్టణం 
సమర్ధుడు x అసమర్ధుడు 
ప్రారంభించు x ముగించు 
చౌక x ప్రియం 

ఏకవచనం - బహువచనం:

సమర్ధుడు - సమర్ధులు 
కుటుంబం - కుటుంబాలు 
పట్టణం - పట్టణాలు 
నష్టం - నష్టాలు 

అభ్యాసము: 

1) క్రింది వాక్యాలలో తప్పు (x), ఒప్పు (-/) లను గుర్తించండి. 

అ) కన్నయ్య భార్య పేరు యశోద. (  ) 
ఆ) రెండోవాడు సరుకుల్ని కొని తేవడంలో దిట్ట. (  )
ఇ) ముగ్గురు కుమారులు కలసి వ్యాపారం ప్రారంభించారు . (  )
ఈ) కొద్ది రోజులకే ముగ్గురి వ్యాపారాలు దివాలా తీశాయి. (  )


2) క్రింది ఖాళీలను పూరించండి. 

అ) వారికి ముగ్గురు ............... సంతానం. 
ఆ) కొడుకుల సహాయంతో కన్నయ్య............ రెండింతలు అయింది. 
ఇ) ..............ఆస్తిని ముగ్గురికీ పంచేసాడు. 
ఈ) కలసి ఉంటే కలదు సుఖమని పెద్దలు .................... చెప్పలేదు. 

3) క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. 

అ) కన్నయ్యకు ఎంతమంది కొడుకులు
ఆ) మూడోవాడు అన్నలకి ఎలా సలహాలిచ్చేవాడు
ఇ) ముగ్గురు అన్నదమ్ములు విడివిడిగా ఎందుకు వ్యాపారాలు ప్రారంబించారు

ఈ) పెద్దవాడు వ్యాపారం చేయడంలో ఎందుకు ఇబ్బంది పడ్డాడు?

No comments:

Post a Comment