Thursday, October 10, 2013

షికారులో నంబర్లు

రచన: రాధ మండువ 
చిత్రాలు: అడవి రాముడు 
అభ్యాసము: శైలజ వాడకట్టు 


"తమ్ముడూ! షికారుకి వెళదామా?" అంది శీతల.
"వెళదాం! వెళదాం!" గంతులు వేశాడు రాము.
ఇద్దరూ బయలుదేరారు.


"తమ్ముడూ! అదిగో కాకి. తన ఇద్దరు పిల్లలకీ ఎగరడం నేర్పిస్తోంది" చెప్పింది శీతల, చెయ్యెత్తి పైకి చూపిస్తూ.
"ఆయ్! భలే ఉన్నాయి పిల్ల కాకులు నల్లగా!" అన్నాడు రాము, పైకి చూస్తూ.
"తమ్ముడూ ! అదిగో చూడు - అమ్మ ఆవు. దానికొక దూడ. ఆ పిల్లకు గడ్డి తినటం నేర్పిస్తోంది తల్లి " అంది శీతల.
"భలే! భలే! ఆవు దూడ ఎంత బావుందో!" అన్నాడు రాము సంతోషంగా.


"ముందు చూసి నడువు. అదిగో చెరువు. ఒడ్డున ఉన్న ఆ కప్ప చూడు తన ముగ్గురు పిల్లలకీ గెంతడం నేర్పిస్తోంది" అంది శీతల, తమ్ముడి భుజం పైన చెయ్యి వేసి నడిపిస్తూ.
చెరువు దగ్గరకి వేగంగా నడిచి "బుజ్జి కప్పలు భలే గెంతుతున్నాయి. నేను కూడా వాటిలాగే గెంతుతా" అన్నాడు రాము." సరే! తర్వాత గెంతుదువుగాని. ఇటు చూడు- చేప తన నలుగురు పిల్లలకీ ఎలా ఈదాలో నేర్పిస్తోంది" అంది శీతల.
"భలే! అబ్బ! చేప పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో!" అన్నాడు రాము.
"సరే! దా! ఆలశ్యమవుతోంది. ఇంటికి వెళదాం! " అంది శీతల.


ఇద్దరూ మళ్ళీ ఇంటి దారి పట్టారు.
"అక్కా! చూడు - చూడు - గాజు పురుగులు!" అన్నాడు రాము.
"ఔను! ఈ అమ్మ గాజు పురుగు తన ఐదుగురు పిల్లలకీ పాకడం నేర్పిస్తోంది!" అంది శీతల.
వాటినే చూస్తూ కూర్చున్న తమ్ముడితో "పద, ఇంటికి వెళదాం. అమ్మ ఎదురు చూస్తుంటుంది" అంది వాడిని లేపుతూ.ఇద్దరూ ఇంటికి చేరారు. "అమ్మా! అమ్మా! మరే! నేను ఇప్పుడు ఒక ఆవు పిల్లని, ఇద్దరు కాకి పిల్లలను, ముగ్గురు కప్ప పిల్లలను, నలుగురు చేప పిల్లలను, ఐదుగురు గాజు పురుగు పిల్లలను చూశాను" అన్నాడు రాము అమ్మ చెయ్యిని ఊపేస్తూ.
వాడి మాటలకు అమ్మ, శీతల పక పకా నవ్వారు.


"ఎందుకు నవ్వుతారు?" అన్నాడు రాము బుంగమూతి పెట్టి.
"వస్తువుల పేర్లు, జంతువుల పేర్లు చెప్పినపుడు ఒక ఆవు, రెండు కాకులు, మూడు కప్పలు, నాలుగు చేపలు, ఐదు గాజు పురుగులు - ఇలా అనాలి " అంది అమ్మ వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని. "ఓహో! అలాగా!" అన్నాడు వాడు.ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

1. ఈ కథలో ఉన్న అక్క, తమ్ముడి పేర్లు వ్రాయండి? అలాగే అక్క, తమ్ముడిని ఎక్కడికి వెళదాం అంది?

2. ఆవు పిల్లని ఏమంటారు?
3. కాకి కి పిల్లలు ఎందరు? కాకి తన పిల్లలకి ఏమి నేర్పిస్తుంది? కాకులు ఏ రంగులో ఉంటాయి? 
4.రాము చెరువు ఒడ్డున ఏమి చూశాడు? 
5. కప్పలు ఎన్ని? అవి ఏమి చేస్తాయి? 
6. చేప పిల్లలు ఎన్ని? చేప తన పిల్లలకి ఏమి నేర్పిస్తుంది? 
7. నీకు అక్క కాని తమ్ముడు కాని అన్న కాని చెల్లెలు కాని ఉన్నారా? వాళ్ళతో భయటకు వెళ్ళిన ఒక సందర్భాన్ని వ్రాయండి? 


ఈ క్రింది పదాలను జత పరచండి 

ఆవు                            ఐదు 
కాకి                             ఈత
కప్ప                            నలుపు
చేప                            రాము
గాజుపురుగులు             దూడ
శీతల                           గెంతుతుంది


క్రింది ఖాళీలను పూరించండి.

- శీతల , రాము ...................... బయలు దేరారు.

- ఆవు పిల్లకు ........................ తినటం నేర్పిస్తుంది.

- కాకి పిల్లలకు ............... నేర్పిస్తుంది.


- బుజ్జి కప్పలు భలే ......................... .

- శీతల, అమ్మ ..................నవ్వారు.

    No comments:

    Post a Comment