Tuesday, September 6, 2011

కుంబకర్ణుడు

        పోయినవారం కథ ఇంద్రజిత్తు వచ్చి యుద్ధం చేసేవరకూ అయింది కదా...ఇప్పుడు రావణుడు తమ్ముడైన కుంబకర్ణుడి గురించి చెప్పుకుందాం.

         కుంబకర్ణుడు, సంవత్సరం అంటే ఇయర్ లో ఆరు నెలలు నిద్రపోతూనే ఉంటాడు. మేల్కొన్నప్పుడు ఆ ఆరునెలలు ఏదో ఇకటి తింటూనే ఉంటాడు. మళ్ళీ ఆరునెలలు నిద్ర. ఇలా అన్నమాట. అతని శరీరం కొండంత పెద్దగా ఉంటుంది. పైగా అతడు చాలా బలవంతుడు కూడా. "అతణ్ణి యుద్దానికి పంపించాలి నిద్ర లేపుదాం" అనుకుంటారు. పెద్ద పెద్ద శబ్దాలు చేసినా, ఏనుగులతో తొక్కి౦చినా, ఏం చేసినా కూడా నిద్ర లేవడు. అప్పుడేం చేశారంటే మంచి ఘుమఘుమలాడే పదార్ధాలను అతని దగ్గర పెట్టారు. ఆ వాసనకు మేల్కుని లేచి, ఆ కొండంత రాక్షసుడు యుద్ధంరంగం అంటే యుద్ధం జరిగే ప్రదేశానికి వెళ్లాడు. అతని పాదాల కింద పడి నలిగిపోయి పాపం చాలా మంది వానరులు చచ్చిపోయారు. దొరికిన వారిని దొరికినట్లు పట్టుకుని నమిలి మింగేసాడతను. అప్పుడు రాముడు ముందుకు వచ్చి బ్రహ్మాస్త్రం వేసి ఆ రాక్షసుడ్ని చంపేస్తాడు.

       కుంబకర్ణుడు చనిపోయాడని తెలిసి రావణుడు చాలా బాధపడతాడు. ఆ వార్త విన్న ఇంద్రజిత్తు వాళ్ళ నాన్నతో,  ఈసారి ఆ రామ లక్ష్మణుల్ని చంపి కాని రానని చెప్పి యుద్దానికి వెళ్తాడు. ఇంద్రజిత్తు మహా మాయావి కదా మేఘాల చాటునుండి బాణాలు వేస్తుంటాడు. ఒక బాణం తగిలి లక్ష్మణుడు తెలివితప్పిపోతాడు అంటే ఫెయింట్ అవుతాడు. రాముడు, తన తమ్ముడు చనిపోయాడని భావించి చాలా బాధపడుతు౦టే అక్కడే ఉన్న వానర వైద్యుడు పరీక్షించి,"లక్ష్మణుడు కళ్ళుతిరిగి పడిపోయాడు, తెల్లవారేలోగా సంజీవకరణి అనే మూలికను తెచ్చి అతనికి తాకిస్తే మళ్ళీ మామూలుగా అవుతాడని" చెప్తాడు.

     హనుమంతుడు ఆ మణిని తీసుకురావడానికి సంజీవ పర్వతానికి వెళ్తాడు. ఆ పర్వతం మీద చాలా చెట్లూ, రాళ్ళూ అన్నీ ఉంటాయి కదా...వాటిలో ఆ మూలిక ఏదో తెలియక మొత్తం పర్వతాన్నే ఎత్తుకుని వచ్చేస్తాడు. ఆ మూలిక వాసన చూపించగానే లక్ష్మణుడికి తెలివి వస్తుంది. అప్పుడు లక్ష్మణుడు మళ్ళీ యుద్దానికి వచ్చి బ్రహ్మాస్త్రం వాసి ఆ మేఘనాదుణ్ణి, అంటే ఇంద్రజిత్తుని చంపేస్తాడు.

      ఆ విధంగా రాక్షసులలో ప్రముఖులందరూ చనిపోతారు, చివరకు మిగిలింది రావణుడు. రావణుడు యుద్దానికి వెళ్లబోతుండగా రావణుడి భార్య మండోదరి అడ్డుపడి, "మన వాళ్ళందరినీ చంపేసారంటే వాళ్ళు ఎంత మహిమ గలవారో తెలిసింది కాదా..సీతమ్మను అప్పగించండి, ఈ యుద్ధం ఆపేయండి" అని బతిమలాడుతుంది. అప్పుడు రావణుడు ఏమంటాడ౦టే, "రాముడు శ్రీ మహా విష్ణువని నాకు తెలుసు, రామలక్ష్మణుల చేతిలో చనిపోయి మన వాళ్ళందరూ విముక్తి పొందేరు. నన్ను రాముని చేతిలో చావనివ్వు. అదే నాకు మోక్షము" అని చెప్తాడు. యుద్దంలో ఏమి జరిగిందో మనం వచ్చే వారం తెలుసుకుందాము.

కుంబకర్ణుడు ఎవరు?
అతన్ని ఎలా నిద్రలేపారు?
ఇంద్రజిత్తు ఎవరు?
లక్ష్మణునికి ఏమైనది?
సంజీవినీ పర్వతాన్ని ఎవరు తీసుకుని వచ్చారు?
రావణుని భార్య పేరు ఏమిటి?
ఫెయింట్ అవడాన్ని తెలుగులో ఏమంటారు?
సంవత్సరము అంటే?


No comments:

Post a Comment