Friday, September 9, 2011

లంకా దహనము

         హనుమంతుడు సీత కష్టాలను చూసి ఎంతో బాధ పడ్డాడు. ఆమెను బంధించిన అంటే కట్టివేసిన రావణుడిపై ఎంతో కోపం వచ్చింది. రావణుడికి రాముని శౌర్యం అంటే పవర్ గురించి చెప్పాలనుకున్నాడు. మరి రావణుడిని చూడడం ఎలా అని అలోచించి ఆ అశోకవనంలో చెట్లన్నీ పీకేసి ఆ తోటను నాశనం చేశాడు. అడ్డం వచ్చిన రాక్షసులనందరినీ చంపేశాడు. ఈ విషయం తెలిసి రావణుడి కొడుకైన ఇంద్రజిత్తు వచ్చి హనుమంతునిపై బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మదేవుడు హనుమంతుడికి ఆ ఆస్త్రం పని చేయని వరం ఇచ్చి ఉంటాడు. అందువల్ల ఆ బాణం అతన్నేమీ చేయలేదు, కాని రావణుడి దగ్గరకు వెళ్ళాలన్న కోరికతో ఆ ఆస్త్రానికి అంటే బాణానికి కట్టుబడినట్టు నటిస్తాడు. ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి రావణాసురిడి దగ్గరకు తీసుకుని వెళ్తాడు.

       లోపలకు వెళ్ళగానే హనుమంతుడు ఒక్కసారి విదిలించగానే బ్రహ్మ్హాస్త్రం పట్టు విడిపోతుంది. సభా మధ్యలో నిలబడున్న హనుమంతుణ్ణి చూసి రావణుడు, "ల౦కలోకి ఎలా వచ్చావు? అసలు నీవెవరవు?" అని అడుగాడు. "నేను రాముడు పంపించగా వచ్చాను" అని చెప్తాడు. రామదూతనని చెప్పినా కూడా రావణుడు కనీసం కూర్చోమని అయినా చెప్పడు. అప్పుడు హనుమంతుడు ఏమి చేశాడో తెలుసా..తన తోకను పెంచి రావణుడి సింహాసనం కన్నా ఎత్తుగా చేసుకుని ఎక్కి కూర్చుంటాడు. సీతను రామునకు అప్పగించి శరణు కోరితే క్షమించి వదిలివేస్తాడని లేకపోతే రావణుడిని, లంకారాజ్యాన్ని సర్వనాశనం అంటే పూర్తిగా డెస్ట్రాయ్ చేయగలడనీ చెప్తాడు. రావణుడు ఆ మాటలు వినకపోగా హనుమంతుడి తోకకు నిప్పటించమని భటులకు చెప్తాడు. హనుమంతుడు మండుతున్న తోకతో ఎగురుతూ లంకానగరం అంతా కాల్చివేస్తాడు.

       లంకా దహనం తరువాత సముద్రంలో తోకముంచి చల్లార్చుకుని సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని ఆకాశంలోకి యెగిరి సముద్రము దాటి అవతలి గట్టుకు చేరుకుంటాడు. హనుమంతుడు శ్రీరాముని దగ్గరకు వెళ్లి "ప్రభూ నేను సీతమ్మను చూశాను" అని చెప్పి ఆవిడ గుర్తుగా ఇచ్చిన శిరోమణిని చూపించాడు. సీతమ్మ అక్కడ ఎంత బాధగా ఉన్నదో వివరించి చెప్తాడు.

       లంకలో రావణుడు తన మంత్రులను పిలిచి ఒక కోతి వచ్చి లంకాదహనము చేసి వెళ్ళినది. ఇప్పుడు రామలక్ష్మణులను యుద్దానికి వస్తారు. మనమేమి చెయ్యాలో ఆలోచించాలి అని చెప్తాడు. దానికి రావణుడి తమ్ముడు విభీషణుడు ఏమంటాడంటే "అన్నా, రాముడు చాలా బలవంతుడు మనం యుద్ధం చెయ్యొద్దు. సీతను తీసుకువెళ్ళి అప్పగించి రామున్ని క్షమించమని అడుగుదాము" అంటాడు. రావణుడికి చాలా కోపం వస్తుంది. నాముందు మన శత్రువుని అంటే ఎనిమీని పొగుడుతావా అని విభీషణున్ని కోప్పడి లంక నుంచి పంపించి వేస్తాడు.

సీత ఏ వనంలో ఉంది?
బ్రహ్మాస్త్రం అంటే ఏమిటి?
శరణు కోరడం అంటే ఏమిటి?
ఇంద్రజిత్తు ఎవరు?
ఇంద్రజిత్తు హనుమంతునిపై ఏ బాణం వేశాడు?
హనుమంతుడు రావణ సభలో ఏం చేసాడు?
హనుమంతుడు లంకా నగరాన్ని ఏం చేసాడు?
హనుమంతుడు రామునితో ఏమి చెప్పాడు?
విభీషణుడు ఎవరు?
విభీషణుడు రావణునితో ఏం చెప్పాడు? దానికి రావణుడు ఏం చేశాడు?


No comments:

Post a Comment