Thursday, September 15, 2011

హనుమంతుని లంకా ప్రవేశము

        వానర సైన్యం అంతా సీతను వెతకడానికి వెళ్ళారు కదా..కొండలూ గుట్టలూ అన్నీ వెతికారు ఎక్కడా కనిపించలేదు. "ఏం చెయ్యాలా" అని ఆలోచిస్తూ మహేంద్ర పర్వతం చేరుకున్నారు. అక్కడ వాళ్లకు జటాయువు సోదరుడు అంటే తమ్ముడు ఐన 'పంపాతి' అనే గద్ద కనిపించి౦ది. గద్ద అంటే ఈగల్ అని తెలుసుకదా..ఆ గద్ద వాళ్ళెందుకు బాధ పడుతున్నారో తెలుసుకుని రావణుడు సీతను సముద్రము అంటే 'సీ' మీదుగా తీసుకెళ్ళడం తాను చూశానని చెప్పింది. అంతేకాదు సముద్రమునకు ఆ వైపున లంక అనే నగరం ఉన్నట్లు అదే రావణుడు రాజ్యమని కూడా చెప్పింది.

        సరే ఇప్పుడు సీత ఎక్కడ ఉందో వాళ్ళకు తెలిసింది, మరి "ఆ సముద్రమును దాటి ఆ వైపుకు వెళ్ళడం ఎలా?" అని ఆలోచించారు. అక్కడ ఉన్న అందరూ హనుమంతుడిని పిలిచి అతని శక్తి సామర్ధ్యాలను అంటే అతని ఎబిలిటీస్ ని గుర్తుచేసి సముద్రాన్ని నువ్వే దాటగలవు నువ్వు చాలా గొప్పవాడివి అని పొగుడుతారు. హనుమంతుడు ఆ పొగడ్తలకు పొంగిపోయి తన శరీరాన్ని పెద్దగా చేసుకుని దేవతలకు, దిక్పాలకులకు అంటే దిక్కులను పాలించేవారికీ నమస్కరించి, తన తండ్రి అయిన వాయుదేవుడిని తలచుకుని ఆకాశంలోకి రివ్వున ఎగిరాడు. చాలా వేగంగా వెళ్తున్నాడు కదా ఆ శబ్దానికి అడవిలో ఉన్న సింహాలు సైతం పిల్లుల్లా భయపడిపోయాయి. దారిలో కొన్ని రాక్షసశక్తులు అడ్డం వచ్చినా వాటిని తప్పించుకుని సముద్రం అవతలి తీరంలో ఉన్న త్రికూట పర్వతం మీదకు చేరుకున్నాడు.
   
        లంకా నగరం చాలా అందమైన నగరం. ఎత్తయిన కోటలూ పెద్ద గోడలతో శత్రువులు అంటే ఎనిమీస్ లోపలకు వెళ్ళలేని విధంగా ఉందట. సింహాద్వారంలో అంటే ఎంట్రన్స్ దగ్గర లంకిణి అనే రాక్షసి కాపలా కాస్తూ ఉంది. హనుమంతుడు ఆవిడను ఒక్క గుద్దుతో పడగొట్టి అంతకుముందు పెద్ద శరీరంతో ఉన్నాడు కదా ఇప్పుడు మళ్ళీ చిన్నగా మారిపోయి ఆ నగరంలోపలికి వెళ్ళాడు. మేడలూ, మందిరాలూ అన్నీ వెతికాడు, ఎక్కడా సీత కనిపించదు. ఇక తోటలే మిగిలాయని తోటల్లో వెతుకుతుండగా ఒక దగ్గర భటులతో రావణుడు రావడం కనిపించింది. రావణుడు చెట్టుకింద ఏడుస్తూ కూర్చుని వున్న ఒక స్త్రీ దగ్గరకు వెళ్లి "ఏమాలోచించావు? అడవిలో తిరుగుతూ కందమూలాలు తింటున్న రాముడు కావాలా. అష్ట ఐశ్వర్యాలు ఉన్న నేను కావాలా?" అని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ, "ఛీ దుర్మార్గుడా నా భర్త ఇంట్లో లేనప్పుడు నన్ను దొంగతనంగా ఎత్తుకుని వచ్చావు. నన్ను మర్యాదగా రాముడి దగ్గరకు పంపు. రాముడు నిన్ను క్షమించి వదిలి వేస్తాడు. లేకపోతే నీకు రాముడి చేతిలో చావు తప్పదు" అంటుంది. "నేను పదునాలుగు లోకాలనూ గెలిచిన వాణ్ని. నన్ను ఆ మానవుడు చంపుతాడా, జరగని పని. ఇప్పటికి నిన్ను తీసుకుని వచ్చి పది నెలలు అయింది. ఇంతవరకూ రానివాడు ఇప్పుడు వస్తాడా..సరే చూద్దాం." అని బెదిరించి వెళ్ళిపోతాడు.

     ఆ మాటల ద్వారా హనుమంతుడు ఆ స్త్రీయే సీత అని తెలుసుకుంటాడు. తానెవరో సీతకు చెప్పాలికదా అందుకు రాముడి కథను పాటలాగా పాడుతాడు. సీత చాలా సంతోషిస్తుందికానీ అది కూడా రాక్షస మాయ అనుకుంటుంది. అప్పుడు హనుమంతుడు రాముని ఉంగరం చూపించి ఆవిడను నమ్మిస్తాడు. "అమ్మా నువ్వు నా భుజాల మీద కూర్చో నేను నిన్ను రాముని దగ్గరకు తీసుకెళతాను" అని చెప్తాడు. సీత అందుకు ఒప్పుకోదు. "నేను దొంగలాగా రాను నన్ను రాముడే వచ్చి తీసుకెళ్ళాలి "అని చెప్పి, తన గుర్తుగా తన జడలో ఉన్నా చూడామణిని తీసి హనుమంతుడికి ఇస్తుంది.


వానర సైన్యం మహేంద్ర పర్వతం దగ్గరకు వెళ్ళారు కదా వాళ్ళకు అక్కడ ఎవరు కనిపించారు?
గద్దను ఇంగ్లీషులో ఏమంటారు?
పంపాతి వానర సైనికులకు ఏమి చెప్పింది?
హనుమంతుణ్ణి వానర సైన్యం ఎలా పొగిడారు?
మంచి మాటల వలన ఉపయోగం ఏమిటి?
హనుమంతుడు లంకకు వెళ్ళాడు కదా సింహద్వారం దగ్గర ఎవరు కాపలా ఉన్నారు?
హనుమంతుడు సీత కోసం ఎక్కడెక్కడ వెతికాడు?
సీతతో రావణుడు ఏమన్నాడు?
సీతకు తానెవరో చెప్పడానికి హనుమంతుడు ఏమి చేసాడు?
సీత హనుమంతునితో వెళ్లిపోయిందా? ఏమని చెప్పింది?
సీత తన గుర్తుగా హనుమంతునకు ఏమిచ్చింది?


No comments:

Post a Comment