Thursday, September 22, 2011

శబరి..హనుమంతుడు..సుగ్రీవుడు

     పోయినవారం మనం మనం రావణుడు సీతను ఎత్తుకుపోవడం వరకు చెప్పుకున్నాం కదా. ఎత్తుకుపోయి ఏం చేసాడంటే లంకా నగరానికి తీసుకు వెళ్ళి, అశోకవనంలో ఉంచి రాక్షసస్త్రీలను కాపలాగా పెట్టాడు.

      అక్కడ దండకారణ్యం లోనేమో రాముడు లేడిని చంపి వెనక్కు వస్తూ ఉండగా లక్ష్మణుడు ఎదురౌతాడు. రాముడికి అర్ధం కాదు. సీతాకు కాపలాగే ఉండమంటే లక్ష్మణుడు ఇలా వచ్చాడేటబ్బా అనుకుని, "మీ వదినను ఒక్కదాన్నీ వదిలి ఎందుకు వచ్చావు?"అని అడుగుతాడు. దానికి లక్ష్మణుడు "రాక తప్పలేదు అన్నా, ఇది వదిన గారి ఆజ్ఞ" అని చెప్తాడు.

     ఇద్దరూ హడావిడిగా పర్ణశాల దగ్గరకు చేరుకుంటారు. ఎవరున్నారక్కడ ఎవ్వరూ లేరు. రాముడు "సీతా సీతా" అని పిలుస్తూ ఆ చుట్టుపక్కల అంతా వెతుకుతాడు. సీత ఎక్కడా కనిపించలేదు. "అయ్యో ఎంత పని జరిగింది, నా సీతను ఎవరో ఎత్తుకుపోయారు" అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మణుడు సీతకు ఏమీ ప్రాణాపాయం జరిగి ఉండదని అంటే ఎక్కడో సేఫ్ గానే ఉంటుందని, త్వరగా వెళ్లి వెతుకుదామని చెప్తాడు.  ఇద్దరూ వెతుకుతుండగా రెక్కలు తెగిపడిన జటాయువు కనిపిస్తుంది. జటాయువు రాముణ్ణి చూసి "రామా నా పేరు జటాయువు. నేను మీ నాన్న స్నేహితుడను. సీతను రావణుడనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అందుకు అడ్డుపడిన౦దుకు నా రెక్కలు కత్తిరించాడు " అని చెప్పి రాముడి చేతిలో చనిపోతాడు. పాపం జటాయువు.

      రామలక్ష్మణులిద్దరూ జటాయువు చూపించిన వైపుకు వెళుతూ పంపానది దగ్గరకు చేరుకుంటారు. ఆ నదిఒడ్డున వారికి చిన్న గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసే ముందు తలంతా తెల్లగా నెరిసిన ఒక ముసలమ్మను చూసి వాళ్ళు ఆవిడ దగ్గరకు వెళ్తారు. ఆవిడ పేరు శబరి, గొప్ప రామ భక్తురాలు. ఆవిడ రోజూ ఏ౦ చేస్తుందో తెలుసా.. రాముడి కోసం మంచి రుచికరమైన పళ్ళు, తేనె, రాముని పాదపూజ చేయడానికి పువ్వులు అన్నీ సిద్దం చేసి ఉంచుతుంది. ఇప్పుడు రాముడు వచ్చాడు కదా! ఆవిడ చాలా సంతోష౦తో "ఎప్పటికైనా నువ్వు వస్తావని నీకోసమే నేను వేచి చూస్తున్నాను రామా." అని చెప్తుంది. అంతే కాదు రాముని కోసం దాచిన పళ్ళు తీసుకుని వచ్చి ఒక్కక్కటి కొరికి చూసి పండు తీయగా ఉంటే రామునికి ఇస్తుంది. తీయగా లేకపోతే పక్కన పడేస్తుంది.

     రాముడంటే ఆవిడకు ఎంత ఇష్టమో భక్తో చూడండి. మీ ఇంట్లో కూడా మీ అమ్మ మీకేవైనా ఇచ్చేప్పుడు మంచివే ఇస్తుంది కదా. అలాగన్నమాట. 

    శబరి రామలక్ష్మణులకు దక్షిణ దిశకు వెళ్ళమని అక్కడ సుగ్రీవుడు అనే వానర రాజుతో స్నేహం చెయ్యమనీ అందువల్ల రాముని అంతా మంచి జరుగుతుందని చెప్తుంది. దక్షిణ దిశ మంటే తెలుసుకదా సౌత్ సైడ్.

   ఇప్పటి వరకూ మనం బాల కాండం, అయోధ్య కాండం, అరణ్య కాండం చెప్పుకున్నాము. ఇక్కడి నుండి కిష్కింద కాండ మొదలౌతుంది.

    రామలక్ష్ముణులు దక్షిణ౦ వైపుగా వెళ్ళిఋష్యమూక పర్వతం చేరుకుంటారు. అక్కడ వాళ్ళకు హనుమంతుడు పరిచయమై తమ రాజైన సుగ్రీవుడి దగ్గరకు తీసుకు వెళ్తాడు. హనుమంతుడు గుర్తున్నాడా?  సీతాదేవి నగల మూటను కింద పడేసినప్పుడు హనుమంతుడికి దొరికిందని చెప్పుకున్నాం కదా. ఆ హనుమంతుడే ఈ హనుమనుతుడన్నమాట. సుగ్రీవుడి కథ రేపు చెప్పుకుందాం.


రావణుడు సీతను ఎక్కడకు తీసుకుని వెళ్ళాడు?
ఎక్కడ దాచాడు?
జటాయువు ఎవరు?
శబరి ఎవరు? రాముని ఏమి ఇచ్చింది?
ఋష్యమూక పర్వతం దగ్గర ఎవరున్నారు?
ఇంతవరకూ రామాయణంలో ఎన్ని కాదములు పూర్తయ్యాయి?
అవి ఏవి?



No comments:

Post a Comment