Friday, September 23, 2011

సుగ్రీవుని పట్టాభిషేకము

        పోయినవారం రామలక్ష్మణులు హనుమంతుడినీ, సుగ్రీవుడినీ కలిసే వరకూ కథ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సుగ్రీవుడి కథ చెప్తాను. కిష్కింద అనే వానర రాజ్యానికి, సుగ్రీవుడు రాజు, మంత్రేమో హనుమంతుడు. అయితే సుగ్రీవుడి ఒక అన్న ఉన్నాడు. అతని పేరు వాలి. ఆ వాలి ఏ౦చేస్తాడంటే సుగ్రీవుణ్ణి రాజ్యం నుండి తరిమేసి, అతడి భార్యను బంధించి ఉంచుతాడు. సుగ్రీవుడేమో అన్న అంత బలవంతుడు కాడు. పాపం ఏం చెయ్యాలో తోచక, ఏం చెయ్యకుండా ఉండలేక చాలా బాధపడుతూ ఉంటాడు. రామలక్ష్మణుల కథ విని తన కథ కూడా అలాంటిదేనని, వాళ్ళకు, జరిగిందంతా చెపుతాడు. అప్పుడు రాముడు నువ్వేం కంగారు పడకు మేము ఎలాగైనా వాలికి బుద్దిచెప్పి నీ రాజ్యాన్ని నీకప్పజెప్పి నీ భార్యను నీ దగ్గరకు చేరుస్తాను అని చెప్తాడు. అప్పుడు సుగ్రీవుడు, ఆనందంగా "అలా చేస్తే వానర సైన్యం అంతా సీతను వెతకడానికి సహాయం చేస్తుంద"ని చెప్తాడు.

           రాముడు సుగ్రీవుడితో వాలిని యుద్దానికి పిలువమని చెప్తాడు. సుగ్రీవుడు భయపడి, "మా అన్నతో నేను గెలవలేను. యుద్ధం చేయ్యలేనంటాడు." దానికి రాముడు మేమున్నాం కదా ఏమీ ఫరవాలేదని చెప్తాడు. వాలికి సుగ్రీవుడికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. సుగ్రీవుడికి బాగా దెబ్బలు తగులుతాయి. సుగ్రీవుడు, వాలి ఒక్కలాగే ఉండడంతో ఎవరెవరో తెలియక బాణం వెయ్యలేదని రాముడు చెప్తాడు. హనుమంతుడు సుగ్రీవుడి మెడలో పూలదండ వేసి యుద్దానికి పంపిస్తాడు. అప్పుడు రాముడు వాలిమీద బాణం వేసి అతణ్ణి చంపేస్తాడు. సుగ్రీవుడిని కిష్కిందకు రాజుగా చేసి వాలి కొడుకైన అ౦గదుని యువరాజుగా చేస్తాడు.

      తరువాత సీతాన్వేషణ అంటే సీత ఎక్కడుందో వెతకడం గురించి ఆలోచిస్తూ ఉండగా హనుమనుమంతుడు తనకు దొరికిన నగల మూటను తీసుకుని వచ్చి రామునకు చూపిస్తాడు. ఆ నగలు సీతవేనని రాముడు గుర్తుపడతాడు. సుగ్రీవుడు తన సైన్యంలోని వీరులను సీతాదేవిని వెతకడానికి నాలుగు దిక్కులకూ పంపిస్తాడు. రాముడు తన ఉంగరాన్ని హనుమంతునికి ఇస్తాడు. ఎందుకో తెలుసా సీతకు ఈ వానరులు తెలియదు కదా వీళ్ళను చూసి ఎవరో అనుకుంటుందని, ఆ ఉంగరం చూపిస్తే వాళ్ళను  రాముడే పంపించాడని గుర్తుపడుతుందని అన్నమాట. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు దక్షిణ దిశ అంటే సౌత్ వైపు వెళ్తారు. 


సుగ్రీవుడు ఎవరు?
వాలి ఎవరు?
హనుమంతుడు ఎవరు?
వాలి ఏమి చేసాడు?
రాముడు వాలికి ఎలా బుద్ది చెప్పాడు?
వాలి చనిపోయిన తరువాత కిష్కింద రాజ్యానికి రాజు, యువరాజు ఎవరు?
హనుమంతుడు రామునకు ఏమి ఇచ్చాడు?
సీతను వెతకడానికి ఎవరు వెళ్ళారు?
వాళ్లకు రాముడు ఏమి ఇచ్చాడు? ఎందుకు?





No comments:

Post a Comment