Saturday, October 1, 2011

సీతాపహరణం

     శూర్పణఖ ఏడుస్తూ రావణాసురిడి దగ్గరకు వెళ్ళింది కదా! ఎందుకు రావణాసురిడి దగ్గరకు వెళ్ళింద౦టే శూర్పణఖ రావణాసురిడికి చెల్లెలన్నమాట . అప్పుడు రావణుడు "సీతను తీసుకుని వచ్చి లంకలో బంధించి వాళ్ళకు తగిన శాస్తి చేస్తాను" అని ప్రమాణం చేస్తాడు. రామ లక్ష్మణుల గురించిన వివరాలు తెలుసుకున్నాక సీతను తీసుకురాడం ఎంత కష్టమైనా పనో అర్ధం అవుతుంది. ఎదురుగా వెళ్లి యుద్ధం చేయడం కష్టం అని తెలిసిన రావణుడు మాయోపాయంతో అంటే ట్రిక్ చేసి సీతను తీసుకుని రావడానికి నిర్ణయించుకుంటాడు.

       రావణాసురుడు అందుకు ఏం చేసాడో తెలుసా..మారీచుడు అనే రాక్షసుని దగ్గరకు వెళ్లి సీతను తీసుకురావడానికి సహాయం అడుగుతాడు. మారీచుడు రాక్షసుడే కానీ మంచి రాక్షసుడు. "అలా చెయ్యడం తప్పు, పైగా రాముడు సామాన్య మానవుడు కాదు" అని చాలా విధాలుగా నచ్చచెపుతాడు. రావణుడు వినకపోగా "నువ్వు కనుక సహాయం చెయ్యకపోతే నిన్నుచంపేస్తాను" అని బెదిరిస్తాడు. రావణాసురుడి చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చచ్చిపోతే పుణ్యమైనా వస్తుందని మారీచుడు రావణుడు చెప్పినట్లు చేయడానికి ఒప్పుకుంటాడు.

                                                                     *                *               *

       సీతారాములున్న కుటీరం దగ్గర ఒక బంగారు లేడి అంటే గోల్డెన్ డీర్ తిరుగుతూ ఉంటుంది. దాన్ని చూసిన సీత "అబ్బా ఆ లేడి ఎంత అందంగా ఉంది!" అనుకుని, రాముణ్ణి ఆ లేడిని తెచ్చివ్వమని అడుగుతుంది. "బంగారులేడి సృష్టిలోనే లేదు ఇదేదో రాక్షస మాయలా ఉంది." అంటాడు లక్ష్మణుడు. దానికి రాముడు "నేను వెళ్లి చూస్తాను. లేడి అయితే తీసుకుని వస్తాను. రాక్షసుడైతే చంపేస్తాను. నేను వచ్చేవరకూ నువ్వు మీ వదిన దగ్గరే ఉండు" అని లేడిని తీసుకు రావడానికి వెళ్తాడు. అది మాయ లేడి కదా రామునకు అందకుండా చాలాదూరం వెళుతుంది. దాన్ని పట్టుకోవడానికి రాముడు బాణం వేస్తాడు. ఆ బాణం తగిలిన లేడికి అసలు రూపం వస్తుంది. అది ఎవరో తెలుసుకదా మనకు, మారీచుడు. ఆ రాక్షసుడు చనిపోతూ "హా సీతా హా లక్ష్మణా "అని రాముని గొంతుతో అరచి చచ్చిపోతాడు.

       ఆ పిలుపు విన్న సీత, "లక్ష్మణా మీ అన్నకేదో ఆపద ఎదురయ్యినట్లుంది. నువ్వు వెళ్లి చూడు" అంటుంది. ఆపద అంటే డేంజర్ అన్నమాట. అన్నకు ఆపద రాదు అది రాక్షసుల పనే అని ఎంత చెప్పినా సీత వినిపించుకోదు. "నీకేదో దురుద్దేశం అంటే బాడ్ ఇన్టెన్షన్  ఉంది అందుకే నువ్వు వెళ్లనంటున్నావు" అంటుంది. ఆ మాటతో లక్ష్మణుడు బాధపడి, "సరే వెళ్తాను వదినా, కాని నీవు మాత్రం ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ గీత దాటొద్దు." అని బాణంతో పర్ణశాల ముందు ఒక గీత గీసి వెళ్తాడు. సీత దిగులుగా అక్కడే కూర్చుని ఉంటుంది. అంతలో రావణుడు "జంగందేవర " వేషంలో వచ్చి 'భవతీ బిక్షం దేహి" అంటాడు. అంటే అర్ధమేంటంటే 'అమ్మా బిక్ష వెయ్యి' అని. సీత భిక్ష తెచ్చి "తీసుకోండి" అంటుంది. రావణుడు గీత మీద అడుగు వెయ్యగానే మంటలు లేస్తాయి. రావణాసురిడికి ఆ గీత మహిమ అంటే పవర్ అర్ధమౌతుంది. అప్పుడతను "నీవే దగ్గరకు వచ్చి బిక్ష వేయి" అంటాడు. తీసుకువచ్చిన విక్ష వెనుకకు తీసుకునిపోకూడని సీత గీత దాటుతుంది. రాగానే రావణుడు తన అసలు రూపం అంటే రాక్షస రూపం చూపిస్తాడు. సీత భయంతో మూర్చపోతుంది. 

      రావణుడికి 'తానంటే ఇష్టంలేని స్త్రీని ముట్టుకుంటే తల వెయ్యి ముక్కలయ్యే శాపం' ఉంటుంది. శాపం అంటే మీకు తెలుసుకదా కర్స అని. అది గుర్తొచ్చి సీత పడిపోయిన చోటును నేలంతా పెళ్ళగించి ఆకాశంలోకి ఎగురుతాడు. సీతకు మెలకువ వచ్చి "అయ్యో నేను రాముని భార్యను. ఈ దుర్మార్గుడు నన్ను ఎత్తుకుపోతున్నాడు కాపాడండి కాపాడండి" అని గట్టిగా కేకలు పెడుతుంది. దశరధ మహారాజు స్నేహితుడైన 'జటాయువు' అనే పక్షి రాజు ఆ అరుపులు వింటాడు.  విని వెంటనే రావణుడికి అడ్డం వెళ్లి తన 'రెక్కల'తో, 'గోళ్ళ'తో అతడిని గాయపరుస్తాడు. రావణాసురుడు కోపంతో ఆ జటాయువు రెక్కలు ఖండిస్తాడు. పాపం ఆ పక్షిరాజు నేలమీద పడిపోతాడు. 

      సీతకు ఒక ఆలోచన గొప్ప ఆలోచన వస్తుంది. తన చీర కొంగు చింపి తన నగలన్నీ అందులో మూటకట్టి కిందకు పడేస్తుంది. అలా ఎందుకు చేసిందో తెలుసా ఆ నగలను రాముడు చూసి గుర్తుపడితే తానెళుతున్న దారి తెలుస్తుందని. ఆమె అనుకున్నట్లుగానే ఆ మూట సూర్య భగవానునికి అజలి ఘటిస్తున్న హనుమంతుడనే వానరుని చేతిలో పడుతుంది. తరువాత కథ వచేవారం చెప్పుకుందాం.


శూర్పణఖ ఎవరు?
రావణాసురుడు ఎవరిని తీసికెళ్ళాలనుకున్నాడు?
బంగారు లేడి రూపంలో వచ్చి౦ది ఎవరు?
సీత ఏం కావాలని రాముణ్ణి అడిగింది?
"హా సీతా హా లక్ష్మణా" అని ఎవరు అరిచారు?
లక్ష్మణుడు ఆ అరుపు విన్నవెంటనే వెళ్ళాడా?
లక్ష్మణుడు వెళుతూ ఏమి చేశాడు?
సీత దగ్గరకు వచ్చి బిక్ష అడిగింది ఎవరు? ఏ వేషంలో వచ్చారు?
సీత ఏమి చేసింది?
రావణుడికి ఉన్న శాపం ఏమిటి?
సీతను ఎలా తీసుకుని వెళ్లాడు?
ఆకాశంలో రావణుడిని ఎదుర్కున్నదెవరు?
సీత, రామునికి తనెళ్లిన మార్గం తెలియడానికి ఏమి చేసింది?
నగలమూట ఎవరి చేతిలో పడింది?

No comments:

Post a Comment