Saturday, November 19, 2011

అయోధ్య కాండము

శ్రీరామ పట్టాభిషేకం 

     పోయిన వారం సీతారామ కళ్యాణం జరిగి అందరూ అయోధ్యకు వెళ్లడం వరకూ చెప్పుకున్నాం కదా.  తరువాతేమైందంటే దశరధ మహారాజు తన పెద్ద కుమారుడైన రామునికి పాట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయిస్తాడు. అంటే అయోధ్యకు రాజును చేయడం అన్నమాట. ఆ నగరంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారు.

        అయితే మంధర అనే ఆవిడకు ఆ విషయం అస్సలు నచ్చదు. ఇంతకూ మంధర ఎవరో తెలుసా? దశరధ మహారాజు చిన్న భార్య అయిన కైకేయి దాసి. మంధర కైకేయి దగ్గరకు వెళ్ళి "అమ్మా శ్రీ రామ పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి" అని చెపుతుంది. కైకేయి చాలా సంతోషించి, "ఎంత మంచి మాట చెప్పావు. నా రామునికి పట్టభిషేకమా! ఇదిగో ఈ బహుమతులు తీసుకో" అని కానుకలు ఇవ్వబోతుంది. అప్పుడు మంధర, "నువ్వెంత పిచ్చిదానివి! రామునికి పట్టాభిషేకం జరిగితే నీకొచ్చేదేమిటి? నువ్వు జీవితాంతం కౌసల్యకు, నీ కొడుకు భరతుడు రామునికి సేవ చేస్తూ బతకాలి". అని చెప్తుంది. అప్పుడు కైక "అయితే ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు?" అని అడుగుతుంది. దానికి మంధర, "నీకు మహారాజు రెండు వరాలు ఇస్తానని చెప్పాడు గుర్తుందా? ఆ వరాలు ఇప్పుడు అడుగు. ఒకటి భరతునికి పట్టాభిషేకంచెయ్యాలని, రెండవది రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్లాలని చెప్పు" అంటుంది.

       ఆ రెండు వరాలు ఏంటో రాజు కైకేయికి ఎందుకు ఇస్తానన్నాడో ఇప్పుడు చెప్పుకుందాం. ఒకసారి దశరధుడు శంబరాసురుడనే రాక్షసునితో యుద్ధం చేస్తున్నప్పుడు ప్రాణాపాయం ఏర్పడితే ఆయన దగ్గరే వున్న కైక మహారాజును రక్షిస్తుంది. అప్పుడు రాజు ఆమెను "ఏమైన రెండు వరాలు" కోరుకొమ్మని అడిగితే ఆమె "ఇప్పుడు కాదు అవసరమైనప్పుడు అడుగుతాను" అని చెప్తుంది. ఆ వరాలు ఇప్పుడు అడగబోతుందన్నమాట.

         దశరధుడు సుభవార్త చెప్పడానికి కైకేయి మందిరానికి వస్తాడు. కైక తనకు వాగ్దానం చేసిన వారాలు ఇవ్వమని అడుగుతుంది. మహారాజుకి ఏం వరాలు అడుగుతుందో తెలీదుగా పాపం, "ఏం కావాలో కోరుకో" అంటాడు. అప్పుడు తన  రెండు కోరికలు చెప్తుంది. విన్న వెంటనే రాజు చాలా బాధపడి తన నిర్ణయం మార్చుకోమని అడుగుతాడు. "నేను మార్చుకోను నాకు వరాలు ఇస్తారా లేక ఆడిన మాట తప్పుతారా" అని అడుగుతుంది. దశరధుడు మూర్ఛపోతాడు అంటే ఫైంట్ అవుతాడు.

       చూశారా కైకేయి మంచిదే కానీ చెడు సావాసం వలన ఎలాంటి కోరిక కోరిందో.  

       ఇంతలో విషయం తెలిసి రాముడు కైక కోరిక ప్రకారం తాను సంతోషంగా అడవికి వెళతానానీ, భారతుడికే పట్టాభిషేకం చెయ్యమని చెప్తాడు. సీత కూడా రామునితోపాటే అడవికి బయలుదేరుతుంది. లక్ష్మణుడు కూడా రాముని వదిలి ఉండలేన౦టాడు. అలా రాముడు సీత లక్ష్మణుడు అడవికి వెళతారు. దశరధుడుకి తెలివి వచ్చి విషయం తెలిసి బాధపడి 'రామా' అంటూ మరణిస్తాడు అంటే చచ్చిపోతాడు. నలుగురు కొడుకులు ఉండికూడా దశరధుడు మరణించేటప్పుడు ఒక్క కొడుకూ దగ్గరలేకుండా అయిపోవడానికి వెనుక ఓ కథ ఉంది.

       ఒకసారి దశరధుడు వేటకు అడవికి వెళతాడు. అప్పుడు ఒక కొలను దగ్గర నీళ్ళలో ఏదో కదులుతున్న చప్పుడవుతుంది. దశరధుడు ఏదో జంతువనుకుని బాణం వేస్తాడు. అమ్మా అంటూ శబ్దం వినిపిస్తుంది. "అయ్యో ఎవరో ఉన్నట్లున్నారు అని చూసేసరికి శ్రవణుడు అనే అతను బాణం తగిలి పడిపోయి ఉంటాడు. అతనికి దగ్గరకు వెళ్ళేసరికి అతను  "మా అమ్మా నాన్న అంధులూ, వృద్ధులూ...వారిద్దరినీ కావడిలో తీసుకుని వెళుతున్నాను వారికి దాహమయితే నీళ్ళ కోసం వచ్చాను" అని చెప్తాడు. "వారికి నీళ్ళివ్వమని" చెప్పి చనిపోతాడు. దశరధుడు నీళ్ళు తీసుకుని వెళ్ళి వారికి జరిగిన పొరపాటు గురించి చెప్తాడు. వాళ్ళు పాపం వాళ్ళ కొడుకు చనిపోయినందుకు బాధపడి తామెలాగ పుత్రశోకంతో బాధ పడుతున్నామో అలాగే రాజు కూడా పుత్రశోకంతో మరణిస్తాడని శాపం పెట్టి చనిపోతారు.
     
        ఆ శాపం కారణంగానే దశరధ మహారాజు చనిపోయినప్పుడు ఒక్కకోడుకూ దగ్గర ఉండరు. ఆ సమయంలో తమ మేనమామ దగ్గర ఉన్న భరతుడు, శత్రుజ్ఞుడు వచ్చి జరిగినదంతా తెలుసుకుంటారు. భరతుడికి వాళ్ళమ్మ మీద చాలా కోపం వస్తుంది. రాముడ్ని ఎలాగైనా తీసుకుని వస్తానని అడవికి వెళతాడు. భారతుడితోపాటు, శత్రుజ్ఞుడు ఇంకా అంతఃపురం నుండి చాలా మంది బయలుదేరుతారు.


రాముని పట్టాభిషేకం విషయం నచ్చనిది ఎవరికి?
మంధర ఎవరు?
కైకేయి అడిగిన వరాలు ఏమిటి?
రాజు కైకేయికి ఎందుకు వరాలిచ్చాడు?
శ్రవణుడు తల్లిదండ్రులను ఎలా తీసుకుని వెళ్తున్నాడు?
దశరధ మహారాజుకు వృద్ద దంపతులు ఇచ్చిన శాపం ఏమిట్?
అడవికి ఎవరెవరు వెళ్లారు?
భరతుడు ఎవరి కొడుకు?
రాముని తల్లి ఎవరు?

No comments:

Post a Comment