Tuesday, November 22, 2011

సీతా రామ కళ్యాణం


         'మిధిల' నగరానికి రాజు జనకుడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, సీత, ఊర్మిళ. ఆ రాజు సీతాదేవికి పెళ్లి చేయాలాని నిశ్చయించి, నిశ్చయించడం అంటే డెసిషన్ తీసుకోవడం అన్నమాట, ‘స్వయంవరం’ ఏర్పాటుచేస్తాడు. స్వయంవరం అంటే ఎంటంటే, రాజకుమార్తెకు పెళ్లి చేయాలనుకుంటే, ఆ రాజకుమారి తండ్రి ఏదో ఒక పరీక్ష పెట్టి, అందులో పాల్గొనడానికి రాజ కుమారులనందరినీ పిలుస్తారు. ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే అంటే విజయం సాధిస్తే వారికి ఆ రాకుమారిని ఇచ్చి పెళ్లిచేస్తారు. 

         జనక మహారాజు కూడా అలాగే స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ విషయం తెలిసి విశ్వామిత్రుడు రామ, లక్ష్మణులను మిధిలకు తీసుకుని వెళ్తాడు. స్వయంవరం ఏమిటంటే జనక మహారాజు దగ్గర శివధనస్సు ఉంటుంది, ఆ ధనస్సును ఎక్కుపెట్టిన వారికి రాకుమారితో వివాహం అని చెప్తాడు. ఆ స్వయంవరానికి ఎంతో మంది రాజకుమారులు వస్తారు. చాలా మంది ఆ ధనుస్సును పైకే లేపలేకపోతారు. "అయ్యో విల్లు నెక్కుపెట్టే వీరులే లేరా" అని మహారాజు, సభలోని వారు బాధపడుతున్న సమయములో రాముడు వచ్చి విల్లు నెక్కుపెడతాడు. ఆ ధనస్సు విరిగి పోతుంది. అందరూ సంతోషిస్తారు, అప్పుడు సీతాదేవి రాముని మెడలో పూలమాల వేస్తుంది.

         జనకుడు విషయం వివరిస్తూ దశరధ మహారాజునకు మిధిలకు రావలసినదిగా ఆహ్వానం పంపిస్తాడు. దశరధ మహారాజు ఈ వార్త అంటే న్యూస్ విని ఆనందంగా సపరివార సమేతంగా మిధిలకు వెళ్తాడు. అక్కడ ఒకే ముహూర్తానికి రామునికి సీతను, లక్ష్మణునికి ఊర్మిళను, జనకుని తమ్ముని కుమార్తెలయిన మాండవి, శృతకీర్తులను భారత, శత్రుఘ్నులకును ఇచ్చి వివాహం అంటే పెళ్లి జరిపిస్తారు.

       వివాహం అయిన తరువాత దశరధ మహారాజు, రాణులూ, మంత్రి, ఇంకా కొడుకులూ కోడళ్ళూ అందరూ అయోధ్యకు వెళతారు. 

స్వయంవరం అంటే ఏమిటి?
సీతాదేవి తండ్రి ఎవరు?
లక్ష్మణుని భార్య పేరు ఏమిటి?
జనకుడు ఏ నగరానికి రాజు?
సీతాస్వయంవరంలో పెట్టిన పరీక్ష ఏమిటి?
సభలోని వారందరూ ఎందుకు సంతోషించారు?
     

No comments:

Post a Comment