Wednesday, November 16, 2011

అరణ్యకాండ-శూర్పణఖ పరాభవము


      పోయిన వారం ఎక్కడవరకు చెప్పుకున్నామో గుర్తుందా..భరతుడు రాముణ్ణి ఒప్పించి తిరగి అయోధ్యకు తీసుకురావడానికి అడవికి వెళ్తాడు. అప్పుడు భరతుడుకి రాముడుకి మధ్య జరిగిన సంభాషణ చూడండి.

“అన్నా రాజ్యభారము నేను మోయలేను. అందుకు నువ్వే తగిన వాడవు.” అన్నాడు భరతుడు.
“భారతా, తండ్రిగారు ఇచ్చిన మాటకు భంగం కలుగకూడదు. ఇప్పుడు నీతో వచ్చి సూర్యవంశమునకు మచ్చ తేలేను. మనం వంశగౌరవం పెంచాలి గానీ అపకీర్తి తీసుకుని రాకూడదు. అలాగే అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అందువల్ల నువ్వే రాజ్యాన్ని పాలించాలి.”  అంటాడు రాముడు.
“సరే అన్నా అలాగే చేస్తాను. అయితే నీ పాదుకలు అంటే చెప్పులు ఇవ్వు వాటికి పట్టాభిషేకము చేసి నువ్వు వచ్చేవరకు నీ పేరుతోనే రాజ్యపాలన చేస్తాను.” అని చెప్తాడు భరతుడు.

      వశిష్టుని ఆదేశంతో రాముడు తన చెప్పులు ఇస్తాడు. వసిష్టుడు ఎవరో గుర్తున్నాడుకదా రాజగురువు. భరతుడు ఆ చెప్పులను సింహాసనం మీద ఉంచి శతృజ్ఞుడితో కలసి అయోధ్య పక్కనున్న ఒక పల్లెలో, రాముడు ఎలా ఉంటాడో అలానే అంటే కింద పాడుకుంటూ, ఆకులు అలములు తింటూ రాముని పేరుమీద రాజ్యాన్ని పాలిస్తుంటాడు. భరతుడు వచ్చివెళ్ళిన కొద్దిరోజుల్లోనే అక్కడే ఉంటే అయోధ్యనుంచి ప్రజలు వాళ్ళ పనులు మానుకుని వస్తూవుంటారని  సీతారామలక్ష్మణులు దండకారణ్యానికి వెళతారు.

     ఇప్పటివరకు మనము రామాయణంలో రెండు కాండములు వరకు చెప్పుకున్నాము. బాల కాండము, అయోధ్య కాండము. ఇప్పుడు అరణ్యకాండము మొదలవుతుంది.

అరణ్యకాండము-పంచవటిలో నివాసము

      సీతారామలక్ష్మణులు గోదావరి నదీ తీరాన ఉన్న ‘పంచవటి’ అను ప్రదేశములో ‘పర్ణశాల’ నిర్మించుకుంటారు. అయితే ఆ అరణ్యంలో రాక్షసులు ఎక్కువగా ఉంటారట. వారికి బోలెడన్ని మాయలు మంత్రాలు తెలుసు. వారు అడవిలో వున్నవారిని బాధ పెడుతూ ఉంటారట. ఒకరోజు ‘శూర్పణఖ’ అనే రాక్షసి రాముణ్ణి చూసి ఇష్టపడి తన రూపం మార్చుకుని అందమైన అమ్మాయిగా మారిపోయి రాముని దగ్గరకు వస్తుంది. “సీత నీకు తగిన భార్యకాదు. నన్ను పెళ్లి చేసుకో” అంటుంది. అందుకు రాముడు “నేను ఏక పత్నీ వ్రతుడను. ఇంకో పెళ్లి చేసుకోను.” అని చెప్తాడు. శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరకు వెళ్లి తనను పెళ్ళిచేసుకోమంటుంది. లక్ష్మణుడు కూడా ఒప్పుకోడు.

       దీనికంతకూ సీతే కారణమని సీతను గాయపరచబోతుంది. అప్పుడు లక్ష్మణుడు నీ అందాన్ని చూసుకునే కదా నీ గర్వము అని శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తాడు. శూర్పణఖ ఏడ్చుకుంటూ తన అన్నగారైన రావణాసురుని దగ్గరకు వెళ్తుంది. మానవులైన రామలక్ష్మణులకు అంత గర్వమా నేను వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శూర్పణఖకు మాట ఇస్తాడు రావణాసురుడు. వచ్చేవారం మనకు కథలో బంగారు లేడి, జటాయువు, వానరులు ఇలా చాలామంది కనిపిస్తారు.

భరతుడు రాముని ఏమని అడిగాడు?
రాముడు ఏమి సమాధానం చెప్పాడు?
భరతుడు రాజ్యాన్ని పాలించాడా?
సీతారామలక్ష్మణులు ఏ అరణ్యంలో ఉన్నారు?
అది ఏ నదీ ప్రాంతంలో ఉంది?
వాళ్ళున్న ప్రాంతం పేరేమిటి?
శూర్పణఖ ఎవరు?
లక్ష్మణుడు శూర్పణఖను ఏమి చేశాడు?
శూర్పణఖ ఎవరి చెల్లెలు?
రామాయణంలో ఇంతవరకూ ఏయే కాండములు చెప్పుకున్నాము?



No comments:

Post a Comment