Tuesday, October 11, 2011

పావురము చీమ

             అనగనగా ఒక అడవిలో ఓ పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద ఓ పావురం అందమైన గూడు కట్టుకుని ఉంటుంది. ఆ చెట్టుకింద పుట్టలో ఓ చీమ. అవి రెండూ మంచి స్నేహితులు. ఓ రోజు చల్ల గాలి వీస్తూ వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నై. మన చీమ చల్లగాలికి అలా అలా తిరుగుతూ మేఘాలను చూస్తూ  చెట్టునొదిలి దూర౦గా వెళ్ళింది. ఈ ముచ్చట౦తా మన పావురం చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉంది. 

           ఈ లోగా చినుకులు...మన చీమ 'అమ్మ బాబోయ్ వర్షం' అంటూ చెట్టు దగ్గరికి పరిగెట్టి౦ది. ఎంతైనా చీమ నడకలు కదా...పాపం ఇంకా దానింటికి చేరనే లేదు. భోరున వర్షం. ఈ లోగా వర్షం నీళ్ళు చిన్న చిన్న కాలువలుగా మారిపోతున్నాయి. చీమ పరిగెడుతూ..పడుతూ...దొర్లుతూ...చాలా కష్టాలు పడిపోతూవుంది. పావురం దాని బాధ చూస్తూ...అయ్యో అనుకుంటూనే ఏం చెయ్యాలా అని ఆలోచించింది. అప్పుడు దానికి చమక్ మని ఓ ఆలోచన వచ్చింది.

                 ఒక ఆకును తుంచి చీమ ముందు పడేలా వేసింది. ఆకు పడుతుందా? గాలికి కొట్టుకు పోతుందా? పడుతుందా లేదా...పడుతుందా లేదా...అమ్మయ్య చీమ ముందే పడింది. అప్పుడు మన చీమ ఆ ఆకు పడవ మీదెక్కి మెల్లగా చెట్టేక్కేసింది. అప్పుడు చీమ కిందకి చూస్తూ 'అమ్మయ్యో ఎన్ని నీళ్ళో' అనుకుని, పావురంతో 'నీవల్లే నేనివాళ బతికి బయట పడ్డానూ... నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా చేస్తాను' అని చెప్పి౦ది. అప్పటి నుండి వాళ్ళు ఇంకా మంచి స్నేహితులైపోయారు.

               ఒకరోజు పావురం తన బంధుమిత్రులతో కలసి, ఒక చెట్టుకింద గింజలు తింటూ ఉంది. చీమ కొంచెం మెల్లగా నడుస్తూ వెనుక వస్తూ వుంటుంది. అప్పుడు ఒక వేటకాడు 'అబ్బ  భలే చాన్సు'  అనుకుంటూ బాణం పావురం వైపు గురిపెట్టాడు. ఆ చెట్టు దగ్గరే ఉన్న చీమ ఆది చూసి వేట గాడి కాలుమీద గట్టిగా కుట్టేసింది. ఆ వేటగాడు 'చచ్చాను బాబోయ్' అని అరిచి బాణాన్ని పైకి వదిలేసాడు. ఇంకేముంది వేటగాడి అరుపువిని పావురాలన్నీ 'రయ్యిన' ఎగిరిపోయాయి.


No comments:

Post a Comment