Saturday, May 18, 2013

ఏడాది పూర్తయిన సందర్భంగా...

     పరీక్షలు పూర్తయి మార్కులు కూడా ఇవ్వడం జరిగింది. మొదలు పెట్టిన పనిని విజయవంతంగా పూర్తిచేసినందుకు మీ అందరికీ అభినందలు. ఈ వారం జరిగిన మన సమావేశంలో మనమేం మాట్లాడుకున్నామో మరొక్కసారి.
  1. వచ్చే ఏడాది మొదటి రెండు నెలల్లోనే వార్షికోత్సవం జరిపితే బావుంటుంది. సెలవలలో పిల్లలతో ఏమైనా చేయించడానికి సమయం ఉంటుంది. టీచర్లే అక్కర్లేదు. ఒకే తరగతి పిల్లలే కానక్కర్లేదు. ఎవరైనా చేయించొచ్చు. కాకపోతే ఏం చేయిస్తున్నారో ఒక్కసారి టీచర్లకు గ్రూప్ మెయిల్ పంపించండి. అందువలన ఒకే అంశం ఇద్దరు చేయించే అవకాశం ఉండదు. 
  2. తరగతులు ఆగస్ట్ 25 వ తేదీన మొదలౌతాయి. ఆ రోజు వాళ్ళకు పరీక్ష ఉంటుంది. అక్షరాలు నేర్చుకున్న పిల్లలకు అక్షరాలలో, గుణింతాలు నేర్చుకున్న వాళ్ళకు గుణింతాలలో, వత్తులు నేర్చుకున్న వాళ్ళకు ఒత్తుల్లో పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణులయితేనే తరువాతి తరగతికి వెళ్తారు. లేని పక్షంలో వారు ఈ ఏడాది ఉన్న తరగతిలోనే ఉండాల్సి వస్తుంది. 
  3. పిల్లలకు మన భాష నేర్పించడానికి సెలవలు మంచి అవకాశం. వారానికి ఒకసారి మన ఇంటి దగ్గరలో వున్న తెలుగు తరగతుల పిల్లలతో ఏమైనా తెలుగు మీద ఆసక్తి పెంచే ఆటలు ఆడిద్దాం. ఈ విజయాలను మిగిలిన తెలుగు తరగతులతో పంచుకోవడం వలన వారిని ప్రోత్సహించినవారమౌతాము. 
  4. పిల్లలు చదవడానికి బొమ్మల పుస్తకాలను http://kinige.com/kbrowse.php?via=recommended ఈ సైటులో కొనొచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు.
  5. తెలుగుకు సంబంధించిన పిల్లల్లో ఆసక్తి కలిగించే విషయాలు, ఆటలు ఉన్న బ్లాగుల లింకులు మన బ్లాగులోనే ఉన్నాయి. 
  6. తల్లులతో పటు తండ్రులు కూడా పాఠశాల కార్యక్రమాలలో ఉత్సాహంగా పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాం. వచ్చే ఏడాది మరో నలుగురు టీచర్లు అవసరం అవొచ్చు. ఆసక్తి ఉన్నవారు దయచేసి నాకు ఫోన్ చెయ్యండి. 
  7. కొత్త తెలుగు తరగతిలో పిల్లలను చేర్చాలనుకున్న వారికి నా మెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్ ఇవ్వండి. వారు ఆగస్ట్ లో జరిగే సమావేశానికి హాజరు కావాల్సి  ఉంటుంది.
  8. సంవత్సరం చివరలో పాఠశాల పుస్తకం చేద్దాము. దానికోసం తరగతిలో అప్పుడప్పుడు ఫోటోలు తీస్తే బావుంటుంది.
  9. తెలుగు తరగతికి గర్వకారణం స్వచ్చందంగా నిబద్దతతో నిస్వార్దంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు. మాతృభాష నేర్పించాలన్న సంకల్పంతో పిల్లల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు. వారి సలహా, సహాయలతోనే ఈ తరగతులను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతున్నాము.
  10. పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న తెలుగు, ఇంగ్లీషు లైబ్రరీ పుస్తకాలు వకుళ గారి దగ్గర ఉన్నాయి. పుస్తకాలు కావలసిన వారు తనను సంప్రదించండి.
తల్లిదండ్రుల ఇచ్చిన సలహాలు, ఉపాధ్యాయుల సమాధానాలు.

1.తరగతిలో తెలుగు మాట్లాడించడంలో ఎక్కువ సమయం కేటాయించాలి.  

   అలాగే చేద్దాము. తెలుగులో మాట్లాడమని మేమేదైనా అంశం ఇచ్చినప్పుడు మీరు మీ పిల్లలకు ఇంటిదగ్గర దాని గురించి వివరించి తరగతిలో సరిగ్గా చెప్పగలిగేలా వారికి తర్ఫీదు ఇవ్వండి.

2. ఇంటిదగ్గర మేము చెప్పేదానికి తరగతిలో మీరు చెప్తున్న మంచి విషయాలు వారు చక్కగా పాటిస్తున్నారు. ఎక్కువగా ఎలెక్ట్రానిక్స్ వాడడం, ఎక్కువగా వాళ్ళ గదుల్లో సమయం గడపడం లాంటివి చెప్పండి.

    తప్పకుండా చెప్తాము. అలాగే మీకు ఇంకే విషయం చెప్పాలన్నా మాకు చెప్పండి. బ్లాగులో పెడతాము. బ్లాగులో నేను ఇంతకు ముందు ఉంచిన మంచి విషయాలలో చాలా వరకు తల్లిదండ్రుల దగ్గరనుండి వచ్చినవే. 

3. పిల్లలకు చిన్న చిన్న బహుమతులివ్వడం వలన వారికి ప్రోత్శాకరంగా ఉంటుంది. బహుమతులు కూడా మేమే తీసుకొచ్చి ఇస్తాము. ఏదైనా మంచి పని చేసినప్పుడు అంటే హోం వర్క్ చేసినప్పుడు, పరిక్ష బాగా వ్రాసినప్పుడు వారికి బహుమతులివ్వండి.

   తప్పకుండా.

4. పండగ సమయంలో పిల్లలతో ఏమైనా చేయిస్తే బావుంటుంది.

    దీనికి మీ సహకారం కావాలి. మీలో కొంతమంది ఈ బాధ్యత తీసుకుంటే బావుంటుంది. ఉపాధ్యాయుల మీద ఎక్కువ వత్తిడి ఉండదు. మీరూ ఇందులో భాగం పంచుకున్నట్లవుతుంది.

5. మనం ప్రతి నెలా ఇలా కలిస్తే బావుంటుంది కదా.

   మంచి ఆలోచన. నెల నెలా కష్టమౌతుందనుకునే రెండున్నర నెలకోసారి కలుద్దాము.

6. పిక్నిక్ చేస్తే మనం బావుంటుందేమో. అక్కడ పిల్లలందరితో ఏమైనా తెలుగుకు సంబంధించిన ఆటలు ఆడిస్తే బావుంటుంది.

   ఎక్కువగా ఉపయోగముండక పోవచ్చు. ఏ తరగతికి ఆ తరగతి అలా చేస్తే బావుంటుంది. మొత్తం పిల్లలందరినీ తీసుకెళ్ళడమంటే కష్టం.

7. ఈ తెలుగు తరగతుల గురించి పాఠశాల గురించి మన వాహినిలో ప్రచురించొచ్చు కదా.

వాహిని తెలుగు అసోసియేషన్ పత్రిక. అది కమిటీ నిర్ణయించాలి.

8. తెలుగుకు సంబంధించిందే కదా వారికి  అభ్యంతరం ఏముంటుంది?

ఆ విషయం గురించి కమిటీతో మాట్లాడాల్సి వుంటుంది.

9. చలికాలంలో తరగతులు 5 నుండి 6 వరకు పెడితే బావుంటుంది.

 5 గంటలకు చాలామంది పిల్లలకు ఏవో క్లాసులు ఉంటాయి. వారికి కుదరక పోవచ్చు. అదీకాక 6 గంటలు మనకు బాగా అలవాటయి పోయింది. ఇలా మర్చినందువల్ల సమయం మరచిపోయే అవకాశం ఉంది. ఏమైనా తరగతి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిర్ణయించుకోవాల్సిన విషయమిది.

No comments:

Post a Comment