Thursday, September 1, 2011

సీతారాములు అయోధ్యకు చేరుట

          రావణుడు యుద్దానికి వస్తాడు. రాముడికీ, రావణుడికీ భయంకరమైన యుద్ధం జరుగుతుంది. రాముడు వేసిన బాణాలతో రావణుడి తల తెగిపోగానే మళ్ళీ కొత్త తల వచ్చేస్తుంది, అలా ఎన్ని సార్లు చేసినా మళ్లీ మళ్ళీ అలాగే జరుగుతుంటే రాముడికి ఏమి చెయ్యాలో అర్ధమవదు. అప్పుడు రావణుడి తమ్ముడు విభీషణుడు, రావణుడి పొట్టలో అమృత భాండం ఉందనీ పొట్టలో బాణం వేస్తే చచ్చిపోతాడని చెప్తాడు. పొట్టలో బాణం వెయ్యడానికి రాముడు ఒప్పుకోడు, అది యుద్ద ధర్మ౦ కాదు అంటాడు. యుద్ధం చేయడానికి కొన్ని రూల్స్  ఉంటాయన్నమాట. వాటినే యుద్దధర్మ౦ అంటారు.

         రాముడు బ్రహ్మాస్త్రం వెయ్యగానే హనుమంతుడు తన తండ్రి అయిన వాయుదేముడిని ప్రార్ధిస్తాడు. వాయువు అంటే తెలుసు కదా గాలి. అప్పుడు గాలి గట్టిగా వీచి రాముని బాణం రావణుడి పొట్టలో గుచ్చుకునేలా చేస్తాడు. అప్పుడు రావణుడు చనిపోతాడు. అక్కడున్న వానరులు, రాముడు, లక్ష్మణుడు అందరూ సంతోషపడతారు. రాముడు విభీషణున్ని లంకా నగరానికి రాజుగా చేస్తాడు.

       లంకలోని స్త్రీలు సీతను పల్లకీలో రాముడి దగ్గరకు తీసుకొస్తారు. అందరూ చాలా సంతోషిస్తారు. అప్పుడు సీత, "ఇన్ని నెలలు నేను రాక్షసుల రాజ్యంలో వున్నాను కదా అగ్నిపునీతనై రాముని చేరుతాను" అని చెప్తుంది. ఆ కాలంలో ఎటువంటి పాపము చేయని వారు మంటలోకి వెళ్ళినా కూడా పువ్వులా తిరిగి వస్తారన్నమాట, అలా అగ్నిలోవెళ్లి రావడాన్ని అగ్నిపునీత అంటారు. సీత మంచిదని రాముడికి తెలుసు కాని అందరికీ తెలియాలని సీత చితి పేర్చుకుని అందులోకి నడిచి వెళ్తుంది. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై. సీత చాలా మంచిది అని చెప్పి రాముడికి అప్పగిస్తాడు.

         అప్పటికి అరణ్యవాసం పూర్తవడంతో రాముడు సీత లక్ష్మణుడు పుష్పక విమానంలో అయోధ్యకు వెళతారు. ఆ తరువాత రాముడు చాలా కాలం పాటు రాజ్యాన్ని పాలిస్తాడు. రామరాజ్యంలో ప్రజలు ఎటువంటి కష్టాలు లేకుండా హాయిగా ఉంటారు. అందుకే ఇన్ని యుగాల తరువాత కూడా సుఖంగా ఉన్న రాజ్యాన్ని రామరాజ్యం అని పిలుస్తారు. ఆ తరువాత సీతారాములకు లవకుశులు పుడతారు.

రామాయణంలో ఉత్తరకాండం మొదలవుతుంది. మనం కథ ఇంతటితో ఆపేస్తున్నాము.

రాముడు బాణం రావణుడిపై బాణం వేస్తే ఏమి జరిగింది?
రావణుడికి పొట్టలో ఏమి వుంది?
అమృతభాండం గురించి ఎవరు చెప్తారు?
బాణం పొట్టలో తగలడానికి ఎవరు సహాయం చేస్తారు?
లంకానగారానికి ఎవరిని రాజుని చేశారు?
సీత ఏమి చేసింది?
పుష్పక విమానం అంతే ఏమిటి?
చివరికి ఏమైనది?






No comments:

Post a Comment